ఈ ప్రపంచంలో తల్లి ప్రేమకు ఏదీ సాటి రాదంటారు. ఒకప్పుడు మన అమ్మలు ఇంటికే పరిమితమయ్యేవారు. ఇంటి పనులు, పిల్లలు పనులు, భర్త పనులు కనిపెట్టుకుని చూసేవారు. అందుకే వారిని ఇల్లాలు అనే వారు. కానీ ఈ తరం అమ్మలు వేరు.
వారు ఇటు ఇంటినీ.. అటు వృత్తినీ రెంటినీ బ్యాలెన్స్ చేస్తున్నారు. ఈ విషయంలో యాంకర్ సుమ తన అనుభవాన్ని ఓ షోలో పంచుకున్నారు. మనం ఎక్కడ ఏ షో చేస్తున్నా.. ఏ ప్రి రిలీజ్ ఫంక్షన్ లో యాంకరింగ్ చేస్తున్నా.. ఓ మెదడు పిల్లలు గురించి ఆలోచిస్తూనే ఉంటుందట.
పిల్లవాడు తిన్నాడో లేదో.. పాప ఏం చేస్తుందో అన్న ఆలోచన నిరంతరం మెదులుతూనే ఉంటుందట. ఓసారి సుమ వాళ్ల పాప బాల‌్యంలో బాగా జ్వరం వచ్చిందట. సుమను వదలి ఉండలేదట.
అప్పట్లో సుమ స్టార్ మహిళ ప్రోగ్రామ్ చేస్తుండేది.. ఆ వేదిక ముందు చిన్న బల్ల వేసి దాని పై పాపను పడుకోబెట్టుకుని మరీ యాంకరింగ్ చేసిందట. ఏంటో పిల్లలకు అమ్మ దగ్గర ఉంటే అంత భరోసా అంటోంది సుమ. ఇది ఒక్క సుమ అనుభవమే కాదు. ఈనాటి వర్కింగ్ మదర్స్ అందరి అనుభవం. అందుకే అమ్మలకు జోహార్లు.