టాలీవుడ్ ఫిల్మ్ అండ్ ఈవెంట్ సంస్థ శ్రేయాస్ మీడియా సంస్థ సుపరిచితమే. స్టార్ హీరోల సినిమాల దగ్గర నుంచి చిన్న హీరోల సినిమా వరకూ సినిమా ప్రమోషన్ ఈవెంట్లను నిర్వహిస్తుంటుంది. తక్కువ బడ్జెట్ సినిమాలను, అనువాద చిత్రాలను కూడా తెలుగు ప్రేక్షకులకు అందిస్తుంటుంది. ప్రస్తుతం ఆ సంస్థ రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తోన్న `పవర్ స్టార్` అనే సినిమా ఓటీటీలో రిలీజ్ హక్కులు దక్కించుకుంది. అయితే ఇప్పుడీ అంశమే శ్రీయాస్ మీడియాకు వివాదాస్పదంగా మారింది. ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేస్తే శ్రేయాస్ మీడియానే టాలీవుడ్ నుంచి బ్యాన్ చేస్తామని పలువురు అగ్ర నిర్మాతలు వార్నింగ్ ఇచ్చారుట.
ఇంతకీ అంతగా వార్నింగ్ ఇచ్చేంత తప్పిందం శ్రేయాస్ మీడియా ఏం చేసిందంటే? వివరాల్లోకి వెళ్లాల్సిందే. వర్మ తెరకెక్కిస్తోన్న పవర్ స్టార్ సినిమా ప్రచార చిత్రాలు ఇప్పటికే విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా టైటిల్ పోస్టర్ మధ్యలో పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ సింబల్ అయిన గాజు గ్లాస్ ని పెట్టారు. పైగా ఈ కథ ఎన్నికల తర్వాత కథ అని వర్మ ముందుగానే రివీల్ చేసాడు. అలాగే కథలో మెగా ఫ్యామిలీని టచ్ చేసే అవకాశం కూడా ఉందని, ఆఫ్యామిలీని నెగిటివ్ గా చూపించే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో సినిమాని ఓటీటీలో రిలీజ్ చేయకూడదని నిర్మాతలు శ్రేయాస్ మీడియా సంస్థ యాజమాన్యానికి చెప్పినట్లు సమాచారం.
కాదని రిలీజ్ చేస్తే పరిణామాలు తప్పవని హెచ్చరించారుట. మరి శ్రేయాస్ మీడియా సంస్థ ఎలా ముందుకెళ్తుందన్నది చూడాలి. అయితే సదరు సంస్థ మెగా ఫ్యామిలీకి ఎప్పుడూ సపోర్ట్ గానే ఉంటుంది. ఆ సంస్థలో అల్లు అరవింద్ గీతా ఆర్స్ట్ కంపెనీకి చెందిన పీఆర్ ఓలు భాగస్వాములుగా ఉన్నట్లు సమాచారం. అల్లు అరవింద్ పీఆర్ ఓ ల కారణంగా మెగా ఫ్యామిలీకి చెందిన సినిమా ఈవెంట్లు అన్నీ శ్రేయాస్ మీడియా చేస్తుందని పరిశ్రమలో చెబుతుంటారు. కాబట్టి సదరు సంస్థ మెగా ఫ్యామిలీకి వ్యతిరేకంగా వెళ్లే అవకాశం లేదని పలువురి అభిప్రాయం.