‘వాల్మీకి’ వివాదం …రాజకీయ రంగు

‘వాల్మీకి’ టైటిల్‌ వివాదం కొత్త మలుపు

గత కొద్ది రోజులుగా వరుణ్ తేజ నటిస్తున్న తాజా చిత్రం టైటిల్ ‘వాల్మీకి’ పై వివాదం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకూ అనంతపురానికి చెందిన వాల్మీకి సంఘం అభ్యంతరం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత హై కోర్టుకు కూడా వెళ్లారు. ఇప్పుడీ వివాదం రాజకీయ రంగు పులుముకుంటోంది.

తాజాగావాల్మీకి సినిమా టైటిల్‌ను మార్చాలని కోరుతూ గురువారం సీజీఓ టవర్స్‌లోని సెన్సార్‌ బోర్డు కార్యాలయం ఎదుట విశ్వహిందూ పరిషత్, భజరంగ్‌దళ్‌ నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ టైటిల్‌ మార్చాలని బోయ కులస్తులు తీవ్ర ఆందోళన చేస్తున్నారన్నారు. వాల్మీకి బోయలతో పాటు హిందువుల ఆరాధ్య దైవమని పేర్కొన్నారు.

అలాంటి మహనీయుడి పేరు మీద సినిమా తీయడం సరైంది కాదన్నారు. వెంటనే సినిమా పేరును మార్చాలని భజరంగ్‌దళ్‌ రాష్ట్ర కన్వీనర్‌ ఎం.సుభాశ్‌చందర్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సెన్సార్‌ బోర్డు చైర్మన్‌కు రాసిన లేఖను విడుదల చేశారు.

ఈ విషయమై గతంలో దర్శకుడు హరీష్ శంకర్ స్పందించారు. ‘వాల్మీకిని పూజించిన రాముడు కూడా ధర్మం కోసం ఫైటింగ్‌ చేశాడు. ఏదేమైనప్పటికీ మేం వాల్మీకి సంఘం అభిప్రాయాల్ని గౌరవిస్తాం. ఈ సినిమాలో హీరో పేరు వాల్మీకి కాదని ముందే చెబుతున్నా. కాబట్టి గొప్ప వాల్మీకి పేరును మా హీరోకు పెట్టలేదు’ అని హరీష్‌ ట్వీట్లు చేశారు.

‘వాల్మీకి’ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ పాత్ర పోషిస్తున్నారు. 14 రీల్స్‌ ప్లస్‌ సంస్థ దీనిని నిర్మిస్తోంది. మిక్కీ జే మేయర్‌ బాణీలు అందిస్తున్నారు. తమిళ చిత్రం ‘జిగర్తాండ’కు తెలుగు రీమేక్‌ ఇది. త్వరలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.