ప్రస్తుత లాక్ డౌన్ తో మాకు పనిలేదన్నట్లుగానే మాట్లాడారు అగ్ర నిర్మాత…ఆర్.ఆర్.ఆర్ నిర్మాత దానయ్య. ఎట్టి పరిస్థితిల్లో 2021 జనవరి 8న పాన్ ఇండియా మూవీ ఆర్ ఆర్ ఆర్ ని మాత్రం రిలీజ్ చేసి తీరుతామని! బల్లగుద్ది మరీ చెప్పారు. ఇప్పటివరకు 70 శాతం పూర్తయిందని…బ్యాలెన్స్ 30 శాతం చిత్రీకరణ పూర్తి చేయడానికి ఇంకెంతో సమయం పట్టదని.. షూటింగ్ పూర్తయినంత వరకూ ఫాలో అప్ పనులు అప్పుడు వాయిదా వేయకుండా పూర్తి చేసేస్తున్నామన్నారు. గ్రాఫిక్స్ పనులు మాత్రం డిలే లేకుండా జరిపోతున్నాయని ధీమాను వ్యక్తం చేసారు. అయితే దానయ్య ఈ వ్యాఖ్యలను ఏప్రిల్ 14 వరకూ ఉన్న లాక్ డౌన్ ని మాత్రమే దృష్టిలో పెట్టుకుని చేసారు.
మరి ఒకవేళ లాక్ డౌన్ పొడిగిస్తే పరిస్థితేంటి? ఇప్పటికే మే వరకూ పొడిగించే అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. అప్పటికీ వైరస్ అదుపులోకి రాకపోతే జూన్ ..జూలై వరకూ పొడిగించిన ఆశ్యర్య పోనవసరం లేదన్న మాటలు వినిపిస్తున్నాయి. మరి అలాంటి సన్నివేశం కూడా తలెత్తినప్పుడు దానయ్య ఏం చేయబోతున్నారు? జనవరి 8న ఆర్.ఆర్.ఆర్ ని రిలీజ్ చేయగలరా? అని ఇప్పుడు కొంత మంది నెటిజనులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. 70 శాతం చిత్రీకరణ పూర్తి అవ్వడానికి ఏడాదిన్నరకు పైగా సమయం పట్టింది. అలాంటప్పుడు బ్యాలెన్స్ సహా పోస్ట్ ప్రొడక్షన్ ప్యాచ్ వర్క్ ఇతర పనులు పూర్తి చేయడానికి ఏలా లేదన్నా! మరో ఏడాది సమయం పడుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
అసలే గ్రాఫిక్స్ పనులు విదేశాల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. దానికోసం జక్కన్న అండ్ దానయ్య అండ్ టీమ్ అటూ ఇటూ విమానయానాలు చేయాల్సి రావొచ్చు. బాహుబలి టైమ్ లో జక్కన్న హైరానా చూసినదే కాబట్టి ఇప్పుడు అలాంటి సన్నివేశం ఉంటుంది. కానీ ప్రస్తుతం..తర్వాతి ఆరు నెలలు పాటు ప్రపంచ ఎలాంటి పరిస్థితుల్లో ఉంటుందో చెప్పలేకపోతున్నారు. ఇలాంటి పరిస్థితులు కూడా సినిమాలపై పడే అవకాశం కనిపిస్తుందని విశ్లేషిస్తున్నారు. మరి దానయ్య గారు ఇవన్నీ విశ్లేషించారో లేదో? తెలియదు. అయితే దర్శకుడు రాజమౌళి అయితే ఇప్పటివరకూ దీనిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. జక్కన్న నోరు విప్పితే తప్ప అసలేం జరుగుతోందో తెలీని పరిస్థితి నెలకొంది.