దర్శకధీర అంటూ జేజేలందుకుంటున్న రాజమౌళి మళ్లీ దొరికిపోయాడా? అంటే అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. జక్కన్న తీస్తున్న `ఆర్ ఆర్ ఆర్` ఓ హాలీవుడ్ చిత్రానికి కాపీ అని తెలిసింది. `స్టూడెంట్ నెం.1` సినిమా నుంచి రాజమౌళి వరుస విజయాలతో అపజయమెరుగని దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు. అయితే అతని కెరీర్‌లో చేసిన అత్యధిక చిత్రాలన్నీ కాపీ సినిమాలే.
హాలీవుడ్ చిత్రాల్ని తెలివిగా కాపీ చేయడంలో జక్కన్నని మించిన వారు లేరు. ఈ విద్యని గురువు రాజమౌళి నుంచే జక్కన్న నేర్చుకున్నాడు. బాలీవుడ్ హిట్ చిత్రం `సాజన్`ని పాత్రల్ని తెలివిగా మార్చి కె. రాఘవేంద్రరావు `అల్లరి ప్రియుడు` చిత్రాన్ని తెరకెక్కించి సూపర్‌హిట్‌ని సొంతం చేసుకున్నాడు. అదే ఫార్ములాని ఉపయోగిస్తూ ఎవరికీ చిక్కకుండా కాపీ కథలతో వరుస హిట్‌లని బ్లాక్ బస్టర్‌లని రాజమౌళి సొంతం చేసుకుంటున్నాడు.
`రగ్బీ డ్యాన్స్` నుంచి `సై`ని తెలివిగా కాపీ చేసిన రాజమౌళి విక్రమార్కుడు చిత్రాన్ని విజయశాంతి చేసిన `పోలీస్ లాకప్` నుంచి లేపేశాడు. ఇక ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన `మగధీర` చిత్రాన్ని హాలీవుడ్ చిత్రం క్లస్టర్స్ ఆఫ్ ఆరోస్, చండేరీ నవల, `ట్రాయ్` ఆధారంగా కాపీ చేసిన రాజమౌళి అప్పట్లో చండేరీ నవలా రచియిత కారణంగా వివాదాన్ని కూడా ఎదుర్కొన్నారు.
ఇక `మర్యాద రామన్న` చిత్రాన్ని `అవర్ హాస్పిటాలిటీ` నుంచి కాపీ చేసి విమర్శలు ఎదుర్కొన్నారు కూడా. తాజాగా `ఆర్ ఆర్ ఆర్` చిత్రాన్ని కూడా హాలీవుడ్ చిత్రం `ఫైర్ అండ్ వాటర్` నుంచి కాపీ చేశారని తాజాగా విమర్శలు మొదలయ్యాయి. ఈ చిత్రం 1983లో విడుదలైంది. పాత సినిమా కాబట్టి దీన్ని ఎవరూ గుర్తుంచుకునే అవకాశం లేదని, ఆ ధైర్యంతోనే రాజమౌళి కాపీ చేశాడని విమర్శలు వినిపిస్తున్నాయి. మరి ఈ విమర్శల్ని రాజమౌళి ఎప్పటిలాగే లైట్ తీసుకుంటాడో లేక కాపీ కాదని వివరణ ఇస్తారో చూడాలి.