తెర ముందు పోటీపడే హీరోలు తెర వెనుక మాత్రం మంచి స్నేహితుల్లా కలిసిపోతుంటారు. మీడియాకు చిక్కకుండా స్పెషల్ పార్టీల్లో కలిసి ఎంజాయ్ చేస్తుంటారు. సోషల్ మీడియా ప్రభావం బాగా పెరిగిపోయిన ఈ నేపథ్యంలో స్టార్ హీరోల అనుబంధాలు, ప్రైవేట్ పార్టీలు బయటికి వచ్చేస్తున్నాయి. తెర ముందు మెగా హీరోలకు, నందమూరి హీరోలకు పోటీ వుంటోంది. కానీ తెర వెనుక మాత్రం వీరి మధ్య ఎలాంటి పోటీ లేదు. ఈ విషయం ఎన్టీఆర్ `బాద్‌షా` ఓపెనింగ్ రోజే బయటపడింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామ్‌చరణ్ హాజరై ఎన్టీఆర్‌పై క్లాప్ కొట్టాడు. తిరిగి వెళుతున్న సందర్భంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ బావా అంటూ రామ్‌చరణ్‌ని ఆప్యాయంగా పిలవడం, తిరిగి ఓకే బావా అంటూ రామ్‌చరణ్ బదులివ్వడం అక్కడున్న మీడియా వారినే కాదు ఆ ఓపెనింగ్‌లో పాల్గొన్న వారిని ఆశ్చర్యానికి గురిచేసంది. తాజాగా అదే సీన్ మరోసారి సోషల్ మీడియా ట్విట్టర్ వేదికగా రిపీట్ కావడం ఆకట్టుకుంటోంది.
`అల్లు అర్జున్ నటించిన `అల వైకుంఠపురములో` ఆదివారం విడుదలైన విషయం తెలిసిందే. మంచి టాక్ రావడంతో రామ్‌చరణ్‌తో పాటు ఎన్టీఆర్ ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. టెర్రిఫిర్ పెర్ఫార్మెన్స్, త్రివిక్రమ్ బ్రిలియంట్ రైటింగ్ అంటే ప్రశంసలు కురిపించారు. దీనికి అల్లు అర్జున్ `బావా థాంక్యూ వెరీమచ్. నీతో మాట్లాడటం ఆనందంగా వుంది. త్వరలో కలుద్దాం` అని ట్వీట్ చేయడం ఆకట్టుకుంటోంది. రామ్‌చరణ్ బావా లని సంబోధిస్తే.. అల్లు అర్జున్ కూడా ఎన్టీఆర్‌ని బావా అని పిలవడం ఫ్యాన్స్‌కి అర్థం కావడం లేదట. దీంతో ఎన్టీఆర్ మెగా హీరోలిద్దరికీ బావేనా? అంటున్నారు.