కరోనా సాయానికి ఒక్కొక్కరు ఒక్కోలా ముందుకొస్తున్నారు. సెలబ్రిటీలంతా ఎంతో స్ఫూర్తివంతంగా తమవంతు సాయం చేస్తున్నారు. జనాల్ని అప్రమత్తం చేస్తున్నారు. ఈ విషయంలో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి.. అటు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ .. సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్.. ఇతర తారలంతా ఎవరికి వారు తమవంతు సాయం చేస్తున్నారు.
ఇక విజువల్ గానూ స్టార్లు చేస్తున్న సాయం అంతా ఇంతా కాదు. తాజాగా ఫ్యామిలీ పేరుతో ఓ లఘు చిత్రాన్ని రూపొందించి దానిని సోమవారం సాయంత్రం 9 గంటలకు సోని పిక్చర్స్ లో టెలీకాస్ట్ చేస్తుండడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇందులో చిరంజీవి, అమితాబ్, రజనీకాంత్, రణబీర్, ప్రియాంక చోప్రా వంటి దిగ్గజాలు నటించడంతో ఫ్యాన్స్ లో విస్త్రతంగా చర్చ సాగుతోంది. ఈ లఘుచిత్రం చూడాలన్న ఉత్కంఠ మొదలైంది. ఇందులో కరోనా ముప్పు గురించి అలెర్ట్ చేయడమే ముఖ్య ఉద్ధేశం. ఇది ప్రభుత్వాలకు బాసటగా నిలవాలన్న ఆలోచన ఉంది. ఇక దీని ద్వారా వచ్చే నిధిని లక్ష కుటుంబాల నెలరోజుల తిండికి సర్ధుబాటు సాయం చేయాలన్న మంచి సంకల్పం ఉంది. ఒక మంచి కాజ్ కోసం ఈ లఘు చిత్రం కాబట్టి అందరూ ఆదరించాలనే కోరుకుంటున్నారు.
మరోవైపు టాలీవుడ్ లో 24 శాఖల కార్మికుల్లో అవసరార్థుల కోసం ఇప్పటికే సీసీసీ నిధులు సేకరించి నిత్యావసరాల్ని సరఫరా చేస్తున్న సంగతి తెలిసిందే. కరోనా క్రైసిస్ చారిటీ (సీసీసీ)ని ప్రారంభించి మెగాస్టార్ సారథ్యంలో తమ్మారెడ్డి భరద్వాజ.. ఎన్.శంకర్ వంటి వారు సాయం అందిస్తున్నారు. చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారానూ ఈ సాయం చేస్తున్నామని తమ్మారెడ్డి వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇండస్ట్రీలో వేలాది మంది అసంఘటిత కార్మికులు రోడ్డున పడకుండా కనీసం తిండికి తిప్పలు పడకుండా ఆదుకోవడమే సీసీసీ ధ్యేయం. దేశవ్యాప్తంగా తొలిగా స్పందించి ఇలాంటి ఒక కార్యక్రమం చేస్తున్న కమిటీగా సీసీసీకి చక్కని గుర్తింపు దక్కింది. ఇక దీనికి ఇప్పటికే ప్రధాని మోదీ స్థాయిలో ప్రశంసలు దక్కాయని తెలుస్తోంది. కరోనా విషయంలో ప్రజల్లో అవగాహన కల్పించి అలెర్ట్ చేస్తున్న మెగాస్టార్ చిరంజీవికి ప్రధాని మోదీ ఇంతకుముందు ధన్యవాదాలు తెలిపి ఆనందం వ్యక్తం చేశారు. ప్రజా సేవలో మెగాస్టార్ ఎప్పుడూ ముందుంటారని తాజా సన్నివేశం మరోసారి నిరూపిస్తోంది. ఇక ఇరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల నిధికి మెగాస్టార్ సహా మెగా కాంపౌండ్ భారీ విరాళాలు ప్రకటించి అందరికీ స్ఫూర్తిగా నిలవడంపైనా ప్రశంసలు కురుస్తున్నాయి.