మీడియాపై ర‌జ‌నీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

ఇటీవ‌ల కార్పొరేట్ శ‌క్తులు మీడియాలోకి ప్ర‌వేశించ‌డంతో పార‌ద‌ర్శ‌క‌త‌, విశ్వ‌స‌నీయ‌త అన్న‌ది చాలా వ‌ర‌కు త‌గ్గిపోయిన విష‌యం తెలిసిందే. త‌మ‌కు ఏ పార్టీ స‌హ‌క‌రిస్తే వారికి అనుకూలంగా వార్త‌ల్ని ప్ర‌చురించ‌డం, పాతాక శిర్షిక‌ల్లో వార్త‌లు రాయ‌డం అన్న‌ది ప్ర‌ధాన ప‌త్రిక‌ల్లో గ‌త ఇర‌వైఏళ్ల నుంచి మొద‌లైంది. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌ని సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. త‌ట‌స్థంగా వుండ‌కుండా స‌మాజంలో జ‌రుగుతున్న వాస్త‌వాల్ని బ‌య‌ట‌పెట్టే ప్ర‌య‌త్నం చేయండ‌ని మీడియా సంస్థ‌ల‌కు విజ్ఞ‌ప్తి చేయ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

చెన్నైలో జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ర‌జ‌నీ మాట్లాడుతూ మీడియాకు చుర‌క‌లంటించారు. `జ‌ర్న‌లిస్ట్ అంటే `తుగ్ల‌క్` ప‌త్రిక అధినేత చో రామ‌స్వామిలా వుండాల‌ని, నిజాల‌ని నిర్భ‌యంగా చెప్పాల‌ని, అలా చేసిన‌ప్పుడే స‌మాజం, అందులోని వ్య‌వ‌స్థలు స‌క్ర‌మంగా ప‌నిచేస్తాయ‌ని వెల్లడించారు. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో చో రామ‌స్వామి లాంటి జ‌ర్న‌లిస్టులు దేశానికి చాలా అవ‌సరం అని చెప్పుకొచ్చారు. స‌మాజం, రాజ‌కీయాలు, కాలం చెడు బాట‌ప‌డుతోంద‌ని, ఇలాంటి స‌మ‌యంలో మీడియా బాధ్య‌త‌తో వ్య‌వ‌హిరించాల‌ని ర‌జ‌నీ స్ప‌ష్టం చేశారు.

స‌మాజంలో ఏవి నీళ్లో, ఏవీ పాలో జ‌ర్న‌లిస్టులు మాత్ర‌మే చెప్ప‌గ‌ల‌ర‌ని, నిజాల‌ని మాత్ర‌మే రాయండ‌ని, అబ‌ద్ధాల‌ని ఎట్టిప‌రిస్థితుల్లోనూ రాయ‌డానికి ప్ర‌య‌త్నించ‌కండ‌ని ఈ సంద‌ర్భంగా ప‌లు మీడియా సంస్థ‌ల్ని ర‌జ‌నీ అభ్య‌ర్థించ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.