భ‌విష్య‌త్తు అంతా డిజిట‌ల్ రంగానిదే!

అమెరికాకు చెందిన డిజిటల్ ప్లాట్ ఫామ్స్ నెట్ ఫ్లిక్స్‌, అమెజాన్ ప్రైమ్ భారతీయ సినిమా మార్కెట్ ని ప్రభావితం చేస్తున్న విషయం తెలిసిందే. వీటికి తోడు ఇండియాకు చెందిన, జీ 5 వంటి సంస్థ‌లు డిజిట‌ల్ ప్ర‌పంచాన్ని శాసిస్తున్నాయి. ఏ కొత్త సినిమా రిలీజ్ అయినా ఈ ఓటీటీ ప్లాట్ ఫామ్స్‌లో ఏదో ఒక‌దాంట్లో స్ట్రీమింగ్ కావాల్సిందే. దీంతో టాలీవుడ్ నిర్మాత‌ల‌కు కొత్త భ‌యం ప‌ట్టుకుంది. మ‌న సినిమాల్ని డిజిట‌ల్ భూతం మింగేస్తుందా? ఏంటీ మ‌న భ‌విష్య‌త్తు అని ఆలోచించిన అల్లు అర‌వింద్ `ఆహా` పేరుతో డిజిట‌ల్ ప్లాట్ ఫామ్‌కు శ్రీ‌కారం చుట్టార‌ట‌.

ఇదే విష‌యాన్ని ఆయ‌న తాజాగా వెల్ల‌డించారు. ఏడాది క్రితం నుంచే త‌న‌కు ఈ ఆలోచ‌న‌, భ‌యం మొద‌లైంద‌ని, అయితే దాన్ని ఓ శ‌త్రువులా కాకుండా మ‌న మంచికి అనుగుణంగా మార్చుకోవాల‌ని, దాని కార‌ణంగానే `ఆహా` ఓటీటీని మొద‌లుపెట్టాన‌ని స్ప‌ష్టం చేశారు. త‌న ఆలోచ‌న చెప్ప‌గానే రామ్‌, మైహోమ్ రామేశ్వ‌ర‌రావు భాగ‌స్వాములుగా ముందుకొచ్చార‌ని, దీని ద్వారా మ‌న తెలుగు కంటెంట్‌ని అందించాల‌నుకుంటున్నామ‌ని. ఇందులో చాలా మంది పార్ట్‌న‌ర్స్ వున్నార‌ని. ఇది కేవ‌లం ప్రివ్యూ మాత్ర‌మేన‌ని, ఉగాది రోజున భారీగా లాంచ్ చేయ‌బోతున్నామ‌ని, భ‌విష్య‌త్తు అంతా డిజిట‌ల్ రంగానిదే అల్లు అర‌వింద్ వెల్ల‌డించారు.