బ‌న్నీ‌ కోసం ఎవ‌రా‌ జిగేల్‌రాణి?

అల్లు అర్జున్ పాన్ ఇండియా ఫిల్మ్ `పుష్ప‌`

సుకుమార్ సినిమా అంటే అందులో జిగేల్ మ‌నిపించే స్పెష‌ల్ ఐట‌మ్ సాంగ్ వుండాల్సిందే. అది లేక‌పోతే సుక్కు సినిమాకు నిండుద‌న‌మే వుండ‌దు. ఈ సెంటిమెంట్‌ని తొలి సినిమా `ఆర్య‌` నుంచి ఫాలో అవుతూనే వున్నాడు. తాజా చిత్రం `పుష్ప‌`లోనూ స్పెష‌ల్ ఐట‌మ్ సాంగ్ ప్లాన్ చేస్తున్నాడ‌ట‌. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ `పుష్ప‌` చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్న విష‌యం తెలిసిందే.

గంధ‌పు చ‌క్క‌ల స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో రూపొందుతున్న చిత్ర‌మిది. ఇందులో బ‌న్నీ కెరీర్ లో తొలిసారి ఊర‌మాస్ పాత్ర‌లో లారీ డ్రైవ‌ర్‌గా క‌నిపించ‌బోతున్నాడు. ఇటీవ‌ల బ‌న్నీ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా రిలీజ్ చేసిన టైటిల్ ఫ‌స్ట్ లుక్‌, సెకండ్ లుక్ ఈ విష‌యాన్ని స్ప‌ష్టం చేశాయి. పుష్ప‌రాజ్ అనే ఓ లారీ డ్రైవ‌ర్‌కి గంధ‌పు చ‌క్క‌ల స్మ‌గ్లింగ్‌కి వున్న సంబంధిం ఏంట‌నేది ఆస‌క్తిని రేకెత్తిస్తోంది.

పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయ‌బోతున్నారు. త‌న గ‌త చిత్రాల త‌ర‌హాలోనే ఈ సినిమాలోనూ ఓ స్పెష‌ల్ ఐట‌మ్ సాంగ్‌ని సుక్కు ప్లాన్ చేశాడ‌ట‌. ఈ పాట కోసం ఓ బాలీవుడ్ హాటీని సంప్ర‌దిస్తున్నార‌ట‌. ఈ పాట‌తో పాటు టైటిల్ సాంగ్‌ని దేవిశ్రీ‌ప్ర‌సాదే రాసిన‌ట్టు తెలిసింది. ఈ రెండు పాట‌ల‌కు ఇప్ప‌టికే ట్యూన్స్‌ని కూడా సిద్ధం చేశార‌ట. ఈ రెండు పాట‌లు సినిమాకు ప్ర‌ధాన హైలైట్‌గా నిలుస్తాయ‌ని చెబుతున్నారు.