బాల‌య్య కోసం రీమిక్స్ సాంగ్‌!

బాల‌కృష్ణ కెరీర్ ప‌రిస్థితి ప్ర‌స్తుతం ఏమీ బాగాలేదు. తండ్రి బ‌యోపిక్ అంటూ హ‌డావిడి చేసినా ఎవ‌రూ ప‌ట్టించుకోలేదు. పేరు మాట అటుంచితే ఎన్టీఆర్ బ‌యోపిక్ భారీ నష్టాల‌ని తెచ్చిపెట్టింది. దీని త‌రువాత చేసిన సినిమాల‌న్నీ ఆశించిన స్థాయిలో బాల‌య్య‌కు విజ‌యాల్ని అందించ‌లేక‌పోయాయి. దీంతో ఈసారి త‌న ట్ర‌బుల్ షూట‌ర్ బోయ‌పాటి శ్రీ‌నుని న‌మ్ముకున్నారు. ఇద్ద‌రు క‌లిసి ప్ర‌స్తుతం ఓ సినిమా చేస్తున్న విష‌యం తెలిసిందే.

మార్చిలో వార‌ణాసిలో రెగ్యుల‌ర్ షూటింగ్‌ని ప్రారంభించ‌బోతున్నారు. ఇందులో బాల‌య్య డ్యుయెల్ రోల్‌ చేస్తున్నార‌ట‌. అందులో ఓ పాత్ర అఘోరా అని ఇప్ప‌టికే న్యూస్ బ‌య‌టికి వ‌చ్చేసింది. బాల‌య్య‌కు జోడీగా ప‌లువురు హీరోయిన్‌ల‌ని ప‌రిశీలించిన బోయ‌పాటి చివ‌రికి అంజ‌లిని ఫిక్స్ చేసేశాడు. దీంతో మ‌రో హీరోయిన్ శ్రియ వుంటుందా? లేక మ‌ళ్లీ కొత్త హీరోయిన్‌ని దించేస్తారా అని ఫిల్మ్ స‌ర్కిల్స్‌లో వినిపిస్తోంది. `అల వైకుంఠ‌పుర‌ములో` చిత్రంతో మంచి ఊపుమీదున్న త‌మ‌న్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ఇప్ప‌టికే మ్యూజిక్ సిట్టింగ్స్ జరిగాయ‌ట‌. బాల‌య్య కోసం `బంగారు బుల్లోడు` చిత్రంలోని `స్వాతిలో ముత్య‌మంత ముద్దులా…` అంటూ సాగే పాట‌ని రీమిక్స్‌గా వాడ‌బోతున్నార‌ట‌.

త‌మ‌న్ ఐడియాకు బాల‌య్య‌, బోయ‌పాటి జై కొట్ట‌డంతో `బంగారు బుల్లోడు` పాట మ‌రోసారి రీమిక్స్‌గా రాబోతోంది. ఈ పాట‌ని బాల‌కృష్ణ‌, అంజ‌లిపై ప్లాన్ చేశార‌ట‌. మ‌రి ఇది ఈ సారి కూడా మ్యాజిక్ చేస్తుందా? మాస్ ఆడియ‌న్స్‌ని ఆక‌ట్టుకుంటుందా? చూడాలి.