బాలీవుడ్ జిగేల్ రాణి ఫిక్స్ అయిన‌ట్టేనా?

బాలీవుడ్ జిగేల్ రాణి ఫిక్స్ అయిన‌ట్టేనా?

సుకుమార్ సినిమా అంటే అందులో హాట్ ఐట‌మ్ సాంగ్ వుండాల్సిందే. `ఆర్య‌`లో `ఆ అంటే అమ‌లాపురం.. నుంచి `రంగ‌స్థ‌లం` చిత్రంలో `జిగేల్ రాణి..` వ‌రకు సుక్కు చిత్రాల్లోని ఐట‌మ్ నంబ‌ర్స్ ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకున్నాయి. అదే బాట‌లో మ‌రో స్పెష‌ల్ సాంగ్‌ని `పుష్ప‌` చిత్రం కోసం సుకుమార్ ప్లాన్ చేస్తున్నారు.

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెర‌కెక్కిస్తున్న మాస్ మ‌సాల యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ `పుష్మ‌`. మైత్రీ మూవీమేక‌ర్స్ బ్యాన‌ర్ ఈ చిత్రాన్ని అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తోంది. శేషాచ‌లం అడ‌వుల్లో గంధ‌పు చ‌క్క‌ల స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో ఈ చిత్ర క‌థ సాగుతుంద‌ని తెలుస్తోంది. ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రం కోసం `రంగ‌స్థ‌లం` త‌ర‌హాలో జిగేల్ మ‌నిపించే ఓ హాట్ ఐట‌మ్ నంబ‌ర్‌ని సుక్కు ప్లాన్ చేశాడు. ఇందు కోసం దేవిశ్రీ‌ప్ర‌సాద్ ట్యూన్ కూడా రెడీ. ఈ పాట‌లో న‌టించ‌డానికి బాలీవుడ్ హాట్ గాళ్ ఉర్వ‌శీ రౌతేలాని చిత్ర బృందం సంప్ర‌దించింద‌ట‌.

టాలీవుడ్‌లో పాగా వేయాల‌ని చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఊర్వ‌శికి సుక్కు ఆఫ‌ర్ బాగా న‌చ్చింద‌ని టాక్ వినిపిస్తోంది. ఊర్వ‌శి ఐట‌మ్ నంబ‌ర్ చేస్తే ర‌చ్చే అని అంతా అంటున్నారు. మామూలుగానే ఇన్ స్టాలో ఫొటోల‌ని పోస్ట్ చేస్తూ రెచ్చగొట్టే ఊర్వ‌శీ రౌతేలా ఐట‌మ్ సాంగ్ అంటే అందాల్ని ప‌రిచేయ‌దూ అంటున్నారు ఇండ‌స్ట్రీ జ‌నం. ఊర్వ‌శి రౌతేలా తాజాగా హీరో గోపీచంద్ న‌టిస్తున్న `సీటీమార్‌` చిత్రంలోని ఓ కీల‌క పాత్ర‌లో న‌టించ‌డానికి అంగీక‌రించిన‌ట్టు తెలిసింది.