ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి కరోనా వైరస్. ఈ పేరు చెబితే చాలు ప్రపంచ దేశాలన్నీ ఉలిక్కిపడుతున్నాయి. దీన్ని నివారించడం ఎవరి తరం కావడం లేదు. దీని ధాటికి సంపన్న దేశాలైన ఇటలీ, అమెరికా, స్పెయిన్ చేతులెత్తేసినంతపని చేస్తున్నాయి. చైనాలోని పూహాన్ నగరంలో పుట్టిన ఈ వైరస్ ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తోంది.
అయితే దీని నుంచి తప్పించుకోవాలంటే.. మానవజాతి బ్రతికి బట్టకట్టాంటే సోషల్ డిస్టెన్స్ తో పాటు లాక్ డౌన్ ఒక్కటే మార్గమని నమ్మి ప్రపంచ దేశాలన్నీ లాక్ డౌన్‌ని ప్రకటించేశాయి. మన దేశం కూడా 21 రోజుల పాటు లాక్ డౌన్‌ని ప్రకటించేశాయి. దీంతో సామాన్యుల జీవితం దుర్భరంగా మారింది. సినీ కార్మికులు కూడా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు.
అయితే ఈ సంక్షోభ సమయంలో మేమున్నామంటూ స్టార్ హీరోలు ముందుకొచ్చారు. వరుసగా భారీ స్థాయిలో విరాళాలు ప్రకటించారు. ఇప్పటికీ ప్రకటిస్తూనే వున్నారు. సినీ కార్మికుల సంక్షేమం కోసం చిరంజీవి అధ్యక్షతన సీసీసీ (కరోనా క్రైసిస్ చారిటి) పేరుతో ఓ చారిటీని ప్రారంభించారు. దీనికి సి.కల్యాణ్, తమ్మారెడ్డి భరద్వాజ, ఎన్.శంకర్, దామోదర ప్రసాద్‌లతో పాటు కొంత మందిని కమిటీ సభ్యులుగా, ఎగ్జిక్యూటివ్ మెంబర్‌లుగా నియమించింది.
ఇంత జరుగుతున్నా బాలకృష్ణ మాత్రం స్పందించలేదు. మోహన్‌బాబు లాంటి వాళ్లు స్పందించినా బాలయ్య మాత్రం సైలెంట్‌గానే వుంటూ వచ్చారు. దాసరి నారాయణరావు తరహాలో చిరంజీవి పెద్దన్న పాత్ర పోషిస్తున్నాడు కాబట్టే ఈగో కారణంగా బాలకృష్ణ స్పందించలేదనే విమర్శలు వినిపించాయి. ఇన్ సైడ్ టాక్ కూడా అదే అని సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరిగింది. శుక్రవారం ఆ ప్రచారానికి చెక్ పెడుతూ బాలకృష్ణ కోటి 25 లక్షలు ప్రకటించి షాకిచ్చారు. ఇందులో ఏపీ సీఎం నిధికి 50 లక్షలు, తెలంగాణ సీఎం నిధికి 50లక్షలు ప్రకటించిన బాలయ్య సీసీసీ కోసం 25 లక్షలు ప్రకటించి ఆ చెక్కును సీసీసీ కమిటీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ అయిన సీ. కల్యాణ్‌కి శుక్రవారం అందజేయడం ఆసక్తికరంగా మారింది.