ప్ర‌భాస్ – మ‌హేష్ సినిమా తెర వెనుక క‌థ‌!

ఇద్ద‌రు స్టార్ హీరోలు క‌లిసి సినిమాలు చేసి టాలీవుడ్‌లో చాలా కాల‌మ‌వుతోంది. ఆ సంప్ర‌దాయాన్ని మ‌ళ్లీ రాజ‌మౌళి `ఆర్ ఆర్ ఆర్‌`తో మొద‌లుపెట్టారు. ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్ తొలి సారి క‌లిసి న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. పాన్ ఇండియా స్థాయిలో రాజ‌మౌళి తెర‌పైకి తీసుకొస్తున్న ఈ సినిమాపై దేశ వ్యాప్తంగా అంచ‌నాలున్నాయి. ఈ విష‌యాన్ని ముందే గ్ర‌హించిన జ‌క్క‌న్న ఈ చిత్రాన్ని 10 భార‌తీయ భాష‌ల్లో రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నాడు. జ‌న‌వ‌రి 8న వ‌ర‌ల్డ్ వైడ్‌గా రిలీజ్ కాబోతోంది.

ఇదిలా వుంటే ఈ సినిమా త‌రువాత రాజ‌మౌళి చేసే చిత్రం ఎలా వుంటుంది?. ఎవ‌రితో తీస్తాడు?. ఏ స్థాయిలో వుంటుంది? అనే చ‌ర్చ టాలీవుడ్‌లో మొద‌లైంది. `ఆర్ ఆర్ ఆర్‌` త‌రువాత రాజ‌మౌళి మ‌రో పిరియాడిక‌ల్ చిత్రానికి శ్రీ‌కారం చుడుతున్నార‌ని, ఇది `బాహుబ‌లి`కి మించి వుంటుంద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. దుర్గా ఆర్ట్స్ అధినేత కే.ఎల్‌. నారాయ‌ణ‌కు మ‌హేష్ గ‌తంలో ఓ సినిమా చేయాల్సింది. `మిర్చి లాంటోడు` అనే టైటిల్‌ని కూడా అనుకున్నారు. ఈ సినిమా ద్వారా కో డైరెక్ట‌ర్ జాస్తి హేమాంబ‌ర‌ద‌ర్‌రావుని ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం చేయాల‌ని ప్లాన్ కూడా రెడీ అయింది.

అయితే ఆ త‌రువాత ఏం జ‌రిగిందో ఏమో తెలియ‌దు కానీ ఆ ప్రాజెక్ట్ ఇప్ప‌టి వ‌ర‌కు మెటీరియ‌లైజ్ కాలేదు. ఇదే నిర్మాత‌కు రాజ‌మౌళి ఓ సినిమా చేస్తాన‌ని ప్రామిస్ చేశాడ‌ట‌. ఆ ప్రామిస్ కోస‌మే దుర్గా ఆర్ట్స్‌లో మ‌హేష్‌, ప్ర‌భాస్‌ల‌తో క‌లిపి ఓ భారీ పిరియాడిక్ చిత్రాన్ని చేయాల‌నుకుంటున్నార‌న్న‌ది తాజాగా ఫిల్మ్ స‌ర్కిల్స్‌లో వినిపిస్తోంది. దీనికి యువీ కూడా ఓ భాగ‌స్వామిగా వ్య‌వ‌హ‌రిస్తుంద‌ట‌. ఇప్ప‌టికే దీని కోసం క‌థ‌ని కూడా విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ సిద్ధం చేసిన‌ట్లు తెలిసింది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌పై `ఆర్ ఆర్ ఆర్‌` రిలీజ్ త‌రువాతే స్ప‌ష్ట‌త వ‌స్తుంద‌ని టాలీవుడ్‌ స‌ర్కిల్స్‌లో వినిపిస్తోంది.