సేవ్ నల్లమల అంటూ విజయ్ దేవరకొండ
నల్లమల అడవుల్లోని అమ్రాబాద్ ప్రాంతంలో… యురేనియం కోసం తవ్వకాలు జరపాలని కేంద్రం నిర్ణయించింది. దీనిపై స్థానికంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. తవ్వకాల వల్ల పర్యావరణం దెబ్బతింటుందని కొన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా పోరాడుతున్నాయి. ఈ విషయంలో నల్లమల పరిరక్షణ కోసం జనసేన మద్దతుగా నిలుస్తుందని పవన్ ప్రకటించారు. అందువల్ల త్వరలో ఆయన ఈ దిశగా కూడా ఆందోళనలు చేసే అవకాశాలున్నాయి. ఇప్పుడు హీరో విజయ్ దేవరకొండ సైతం నల్లమల ను రక్షించండి అంటూ సోషల్ మీడియా క్యాంపైన్ లో పాల్గొన్నారు.
విజయ్ దేవరకొండ సోషల్ మీడియా వేదికగా నల్లమల అడవిలో కేంద్రం చేపట్టనున్న యురేనియం తవ్వకాలపై స్పందించారు. ఇలాంటి తవ్వకాలు బయో డైవర్సిటీని నాశనం చేస్తాయని, ఇప్పటికే నదులను, వాతావరణాన్ని కలుషితం చేశాం అని, అందుకే ఒక చోట అతివృష్టి, మరొక చోట అనావృష్టి పరిస్థితులు నెలకొన్నాయని ఆయన వేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా నల్లమలలో యురేనియం తవ్వకాలు జరపాలన్న ఆలోచన కేంద్రం విరమించుకోవాలని ఆయన చెప్పడం జరిగింది.
పర్యావరణ వేత్తలతో పాటు సినీ ప్రముఖులు కూడా ఈ పరిణామాలపై తమ గళం వినిపిస్తున్నారు. ఇప్పటికే దర్శకుడు శేఖర్ కమ్ముల సేవ్ నల్లమల క్యాంపెయిన్‌కు తన మద్దతు తెలపగా తాజాగా హీరో విజయ్ దేవరకొండ కూడా ఈ లిస్ట్‌లో చేరాడు.
‘20000 వేల ఎకరాల నల్లమల అడువులు ప్రమాదంలో పడ్డాయి. ఇప్పటికే చెరువులను నాశనం చేశాం, కొన్ని రాష్ట్రాలను వరదలు ముంచెత్తుతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో కరువు పరిస్థితులున్నాయి. నిత్యావసరాలకు కూడా నీరు దొరకని పరిస్థితి ఉంది. ఇప్పుడు ఉన్న కొద్దిపాటి అవకాశాలను కూడా నాశనం చేస్తున్నాం. అదే వరుస దట్టమైన నల్లమల అడవులను నాశనం చేసేందుకు సిద్ధమవుతున్నాం.
మీకు పునరుత్పాదక వనరు కానీ యురేనియం కావాలంటే కొనండి. యురేనియం కొనొచ్చు..? కానీ నల్లమల అడవులను కొనొచ్చా?ఒకవేల మన కొనలేకపోతే, సోలార్ ఎనర్జిలాంటి వాటిని ప్రోత్సహించండి. ప్రతీ మేడ మీద సోలార్ ప్యానల్స్ ఏర్పాటును తప్పనిసరి చేయండి. పీల్చేందుకు గాలి, తాగేందుకు నీరు లేనప్పుడు యురేనియం, కరెంట్ ఏం చేసుకుంటాం’ అంటూ ట్వీట్ చేశాడు విజయ్ దేవరకొండ.