నిర్మాతలకు వరాలు… దర్శకుల కోసం ఎదురుచూపులు!

‘విజేత’ విజయోత్సవంలో అల్లు అర్జున్ ఒక మాట చెప్పారు. ‘మంచి కథతో వస్తే వారాహి చలన చిత్రం సంస్థలో సినిమా చేయడానికి రెడీ’ అని. అక్కడున్న వారంతా అతని మాటలకు చప్పట్లు కొట్టారు. నిర్మాతలకు అల్లు అర్జున్ ఈ విధంగా వరాలు ఇవ్వడం ఈమధ్య తరచూ జరుగుతున్న తంతే. అప్పుడెప్పుడో ఇచ్చిన మాట కోసం లగడపాటి శ్రీధర్ నిర్మాణంలో ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ చేశాడు. అసలు మాటకు వస్తే… ఆ సినిమా దర్శకుడు వక్కంతం వంశీని అతడి దగ్గరకు తీసుకువెళ్ళింది నల్లమలుపు శ్రీనివాస్ అలియాస్ బుజ్జి. అందుకని, బుజ్జికి మరో సినిమా చేయడానికి సిద్ధమయ్యాడు. ఇప్పుడు వారాహి సాయి కొర్రపాటి మంచి కథతో వస్తే సినిమా చేయడానికి సిద్ధమని ఆఫర్ ఇచ్చాడు. అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ బడా నిర్మాత. కావాలంటే ఎన్ని సినిమాలైనా స్వంత సంస్థలో చేసుకోవచ్చు. అలా చేయకుండా నిర్మాతలకు వరాలు ఇవ్వడం మంచి పరిణామమే. కానీ, ఇక్కడ సమస్య ఏంటంటే… అల్లు అర్జున్ ఆఫర్ ఇచ్చిన నిర్మాతలంతా దర్శకుల కోసం ఎదురుచూపులు చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. మెగా కాంపౌండ్‌లో… మరీ ముఖ్యంగా గీతా ఆర్ట్స్ కాంపౌండ్‌లో ఓ పట్టాన కథను ఓకే చేయించుకోలేమని దర్శక రచయితల మనసుల్లో బలంగా ఓ ముద్ర పడటమే. నిర్మాత ఎవరైనా అల్లు అర్జున్‌తో సినిమా చేస్తే… కథ, కథనం తదితర అంశాల్లో ఖచ్చితంగా అల్లు అరవింద్ ఆమోదముద్ర తప్పనిసరి. ఆయన ఆమోదముద్ర వేయాలంటే మినిమమ్ ఆర్నెల్లు పడుతుంది. కథలో అరడజను సూచనలు చెబుతారు. ఎందుకొచ్చిన తలనొప్పులని చాలామంది దర్శకులకు గీతా ఆర్ట్స్ సంస్థకు, సంస్థ జనాలకు దూరంగా వుంటున్నారని ఫిలింనగర్ టాక్.