దిల్‌రాజు పేరు చెప్పగానే శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ గుర్తుకొస్తుంది. ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్స్ కు పెద్ద పీట వేసే బ్యానర్ అది. ఎంత పెద్ద సినిమా చేసినా అందులో కుటుంబ విలువలు తప్పక ఉండేలా ప్లాన్ చేస్తారు దిల్‌రాజు. అలాంటి ఫీల్‌గుడ్ సినిమాలను తీసే దిల్‌రాజు భవిష్యత్తులో దారి తప్పుతారా? మంచీ చెడులు ఆలోచించకుండా సినిమాలు తీస్తారా? `ఏమో.. తీయావచ్చు` అని ఆయనే అంగీకరించారు. ఇంతకీ దిల్‌రాజు ఆ మాటను ఏ సందర్భంలో అన్నారు.. అనేది ఆసక్తికరం. ఆయన కాంపౌండ్‌లోని వ్యక్తి బెక్కం వేణుగోపాల్ నిర్మిచిన `హుషారు` సినిమాలోని ఓ పాటను విడుదల చేశారు దిల్‌రాజు. అక్కడి పోస్టర్ మీద `చెడు తప్ప ఏదీ చూడను, చెడు తప్ప ఏదీ మాట్లాడను, చెడు తప్ప ఏదీ వినను, చెడు తప్ప ఏదీ చేయను` అనే డైలాగులు కనిపించాయి. వాటిని చూసి ఆయన అవాక్కయ్యారు.
`ప్రేక్షకులు కూడా మంచీ చెడులు ఆలోచించి సినిమాలు చూసే రోజులు పోయాయి. లిప్‌లాక్‌లున్నా పట్టించుకోవడం లేదు. భవిష్యత్తులో నేను కూడా ఇలాంటి అంశాలతో సినిమాలు చేస్తానేమో` అని అన్నారు. దిల్‌రాజు ఆ మాట అనేసరికి అవాక్కవడం అందరి వంతయింది. కానీ దిల్‌రాజులాంటి విలువలున్న నిర్మాత అలా అనడానికి కారణం లేకపోలేదు. దానికి కారణం ఏంటంటే… ఆయన ఎన్నో హోప్స్ పెట్టుకుని ఇటీవల విడుదల చేసి `శ్రీనివాస కల్యాణం` ఫ్లాప్ కావడమే అందుకు కారణం అని అందరికీ తెలిసిన మాటే. గతేడాది ఈ పాటికి ఐదు వరుస సక్సెస్‌లతో ఉన్న దిల్‌రాజు ఆరో సక్సెస్ కోసం ఎదురుచూశారు. కానీ ఈ ఏడాది మాత్రం ఇప్పటిదాకా ఆయనకు ఒక్కటంటే ఒక్కటి కూడా చెప్పుకోదగ్గ సక్సెస్ లేకపోవడం బాధాకరం.