టాలీవుడ్ అందగత్తెలు లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేయడానికి భయపడుతున్నారట. అందుకు కారణం లేకపోలేదు. లవర్ పాత్రలు, గ్లామర్ పాత్రలు ఇప్పుడు మాత్రమే చేయగలరు. తర్వాత చేస్తే ఎవరు చూస్తారు? అంటున్నారంతా. నిజమే. అందాల తార రష్మిక కూడా ఇదే విషయం చెబుతోంది.
”అప్పుడే లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేయడమేమిటీ? దానికి చాలా టైం ఉంది. లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేయడం నాకూ ఇష్టమే. ఒక నటిగా మరో కోణంలో అవి నన్ను చూపిస్తాయి. ఓ సినిమా వచ్చింది కానీ, నాకు నచ్చలేదు. నాకు నచ్చి ‘చేయగలను’ అనిపిస్తే.. చేయడానికి ఎలాంటి అభ్యంతరమూ లేదు. అయితే, అలాంటి సినిమాలు చేయడానికి ఇంకా సమయముంది.
కొంత వయస్సు అయిపోయిన తరువాత ఎలాగూ లవర్ పాత్రలు చేయలేను. లవర్ పాత్రలు, గ్లామర్ పాత్రలు ఇప్పుడు మాత్రమే చేయగలను. అందుకే సీరియస్ పాత్రల వైపు ఇప్పుడప్పుడే దృష్టి పెట్టదలుచుకోలేదు. అయినా నేను చేసే సినిమాల్లో నాకు ఎంతో కొంత ప్రాధాన్యత ఉంటుందనే చేస్తున్నాను.” అని చెప్పింది.