కరోనా నియంత్రణ ప్రతీ ఒక్కరి బాధ్యత అని దీని నివారణని ప్రభుత్వాలకే వదిలేయకుండా తమ వంతు బాధ్యతగా ప్రతీ ఒక్కరూ భాగస్వాములు కావాలని, ఈ సందర్భంగా ప్రజల్ని కోరుతున్నానని చిరంజీవి వెల్లడించారు. ఇందులో భాగంగా తన వంతు బాధ్యతగా తన సినిమా షూటింగ్‌ని వాయిదా వేస్తున్నానని ప్రకటించారు. కరోనా నియంత్రణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.
వైరస్ సోకిన వారికి చికిత్స అందించి వైరస్ వ్యాప్తి చెందకుండా గేమ్స్, సినిమా హాల్స్, షాపింగ్ మాల్స్‌ని మూసి వేయడం, స్కూళ్లు కాలేజీలకు సెలవులు ప్రకటించడం మంచి పరిణామం అని అన్నారు. ప్రజలు కూడా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, ఈ విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌గారు ప్రజల్లో ధైర్యాన్ని పెంచేలా చర్యలు తీసుకుంటున్నారని అభినందించారు. ఏపీ ముఖ్యమంత్రి కూడా తగు చర్యలు తీసుకుంటారని భావిస్తున్నానన్నారు. టెక్నీషియన్ల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని 10 నుంచి 15 రోజుల పాటు షూటింగ్‌లు వాయిదా వేస్తే మంచిదని తాను భావిస్తున్నానని, దీనికి అందరూ సహకరిస్తారని ఆశిస్తున్నానన్నారు.