సంక్రాంతికి అల్లు అర్జున్ నటించిన `అల వైకుంఠపురములో` చేసిన హంగామా అంతా ఇంత కాదు. ఎక్కడ చూసినా ఈ సినిమా పేరే వినిపించేలా పబ్లిసిటీని పిచ్చెక్కించారు అల్లు అరవింద్. మొత్తానికి అనుకున్న ప్రకారం ఇండస్ట్రీ హిట్‌గా నిలబెట్టారు. దీంతో ఈ సినిమాపై బాలీవుడ్ జనాల్లో భారీ క్రేజ్ ఏర్పడింది. సంక్రాంతికి సందడి చేసి విజేతగా నిలిచిన ఈ సినిమాపై బాలీవుడ్‌కు చెందిన ఓ ప్రముఖ ప్రొడక్షన్ కంపెనీ మోజు పెంచుకుందట. వెంటనే ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయాలని అల్లు అరవింద్, త్రివిక్రమ్‌కు భారీగానే ఆఫర్ చేసిందని తెలిసింది.
రీమేక్ రైట్స్ కోసం 7 కోట్లు ఇవ్వడానికి సిద్ధపడటంతో టెమ్ట్ అయిన మాటల మాంత్రికుడు రీమేక్ రైట్స్ ఇవ్వడానికి సిద్ధమయ్యారని. అయితే ఆ డీల్ నచ్చకపోవడంతో అల్లు అరవింద్ రీమేక్ రైట్స్ ఎవ్వరికీ ఇచ్చేది లేదని ఖరాకండీగా చెప్పేశారట. దీంతో త్రివిక్రమ్ షాక్‌కు గురైనట్టు చెబుతున్నారు. త్రివిక్రమ్ ఈ చిత్రానికి దర్శకుడే కాదు వన్ ఆఫ్ ది పార్ట్‌నర్ కూడా. అందుకే మంచి ఆఫర్ వస్తుంటే రీమేక్ రైట్స్ ఇచ్చేయాలని డిసైడ్ అయినా అల్లు అరవింద్ పడనివ్వకపోవడంతో ఏం చేయాలో తెలియని స్థితికి వెళ్లిపోయాడని చెబుతున్నారు.
అల్లు అరవింద్ రీమేక్ రైట్స్ కోసం 7 కోట్లు ఇస్తామని బాలీవుడ్ సంస్థ ఇచ్చిన ఆఫర్‌ని తిరస్కరించడానికి అసలు కారణం ఈ చిత్రాన్ని తానే రీమేక్ చేయాలనుకుంటున్నారట. దిల్‌రాజుతో కలిసి `జెర్సీ` చిత్రాన్ని రీమేక్ చేస్తున్నారు. ఇదే తరహాలో `అల వైకుంఠపురములో`ను కూడా రీమేక్ చేయాలని పక్కాగా ప్లాన్ చేస్తున్నారట. అది ఎప్పుడు, ఎవరితో వుంటుంది అన్న వివరాల్ని త్వరలోనే వెల్లడించనున్నారని తెలిసింది.