తెరాస చీఫ్ విప్ ప్ర‌కాష్‌రాజ్ మాట వింటారా?

ఇటీవ‌ల గ‌చ్చిబౌలిలోని ఓ ప‌బ్‌లో రాహుల్ సిప్లిగంజ్ పై తెరాస వికారాబాద్ ఎమ్మెల్మే రోహిత్‌రెడ్డి సోద‌రుడు రిషిత్‌రెడ్డి, అత‌ని అనుచ‌రులు దాడికి తెగ‌బ‌డిన విష‌యం తెలిసిందే. గాయ‌కుడిగా కొంత మందికే తెలిసిన రాహుల్ బిగ్‌బాస్ సీజ‌న్ 3 త‌రువాత పాపుల‌ర్ అయ్యాడు. ఆ పాపులారిటీతో పాటు శ‌తృవుల‌నీ తెచ్చిపెట్టిన‌ట్టుంది. తాజా వివాదాన్ని చూస్తే అదే స్ప‌ష్ట‌మ‌వుతోంది. ఇదిలా వుంటే ఈ వివాదంపై విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాష్‌రాజ్ సీరియ‌స్ అయ్యారు.

కొంత కాలంగా న‌టుడు ప్ర‌కాష్‌రాజ్ అధికార తెరాస‌తో స‌న్నిహితంగా మెలుగుతున్న ప్ర‌కాష్‌రాజ్ రాహుల్ పంచాయితీని ఏకంగా అసెంబ్లీ వ‌ద్ద‌కే తీసుకెళ్లారు. అక్క‌డే ప్ర‌భుత్వ చీఫ్ విప్ దాస్యం విన‌య్ భాస్క‌ర్ ఛాంబర్‌కి వెళ్లి ఆయ‌న‌తో ప్ర‌త్యేకంగా స‌మావేశం అయ్యారు. జ‌రిగిన గొడ‌వ‌లో రాహుల్ త‌ప్పిదం ఏమీ లేద‌ని, అత‌ను రాజీప‌డాల్సిన అవ‌స‌రం లేనే లేద‌ని తేల్చి చెప్పారు. ఇక్క‌డే చిన్న ట్విస్ట్ వుంది. ఎక్క‌డైనా బావే కానీ… అక్క‌డ మాత్రం కాద‌న్న‌ట్టు.. త‌మ పార్టీ ఎమ్మెల్యేపై ప్ర‌కాష్‌రాజ్ ఫిర్యాదు చేస్తే తెరాస నేత‌లు ప‌ట్టించుకుంటారా? సోష‌ల్ మీడియా వేదిక‌గా మంత్రి కేటీఆర్‌ని రాహుల్ న్యాయం చేయ‌మ‌ని కోరినా ఇంత వ‌ర‌కు రిప్లై ఇవ్వ‌లేదు.

అలాంటిది స్వ‌యంగా ప్ర‌కాష్‌రాజ్ వ‌చ్చి న్యాయం చేయ‌మ‌ని కోరితే స్పందిస్తారా? సొంత పార్టీ నేత‌నే శిక్షిస్తారా? అంటే ఇది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌గానే క‌నిపిస్తోందని జ‌నం అనుకుంటున్నారు.