టీజ‌ర్ టాక్‌: `ఫిదా` మ్యాజిక్ రిపీట్ అయ్యేలా వుందే!

`ఫిదా` లాంటి ఫీల్ గుడ్ ల‌వ్‌స్టోరీ త‌రువాత శేఖ‌ర్ క‌మ్ముల నుంచి వ‌స్తున్న చిత్రం `ల‌వ్‌స్టోరీ`. నాగ‌చైత‌న్య‌, సాయిప‌ల్ల‌వి జంట‌గా న‌టిస్తున్నారు. అమిగోస్ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై ఏషియ‌న్ సినిమాస్ నారాయ‌ణ‌దాస్ నారంగ్‌, పి. రామ్మోహ‌న్‌రావు ఈ చిత్రం ద్వారా నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతున్నారు. శేఖ‌ర్ క‌మ్ముల‌, సాయిప‌ల్ల‌వి కాంబినేష‌న్ మ‌రోసారి క‌ల‌సి పని చేస్తుండ‌టంతో ఈ చిత్రంపై భారీ అంచ‌నాలే వున్నాయి. ఇందులో తొలిసారి క‌లిసి న‌టిస్తున్న చై, సాయి ప‌ల్ల‌విల మ‌ధ్య మంచి కెమిస్ట్రీ వ‌ర్క‌వుట్ అయిన‌ట్టు కనిపిస్తోంది.

తాజాగా రిలీజ్ చేసిన `ఏయ్ పిల్లా…` టీజ‌ర్‌లో అది కొట్టొచ్చినట్టు క‌నిపించింది. ఏ పాత్ర‌లో.. ఏ సినిమాలో న‌టించినా త‌న‌దైన న‌ట‌న‌తో ఆ పాత్ర‌లో ఒదిగిపోవ‌డం సాయి ప‌ల్ల‌వి స్పెషాలిటి. అదే ఈ సినిమాలోనూ మ్యాజిక్ చేయ‌బోతున్న‌ట్టు తెలుస్తోంది. వాలెంటైన్స్ డే సంద‌ర్భంగా రిలీజ్ చేసిన టీజ‌ర్‌లో సాయి పల్ల‌వి హీరో నాగ‌చైత‌న్య ముగ్గ‌పై స‌డన్ ముద్దు పెట్ట‌డం… దానికి చై భావోద్వేగానికి లోన‌వ్వ‌డం… ముద్దు పెడితే ఏడుస్తారా అబ్బ` అంటూ తెలంగాణ యాస‌లో సాయిప‌ల్ల‌వి ప‌లికిన డైలాగ్‌లు ఆక‌ట్టుకుంటున్నాయి. రౌడీ పిల్ల భానుమ‌తి చైత‌న్య‌ని మొత్తానికి ఏడిపించేసింద‌ని ఫ్యాన్స్ గోల చేస్తున్నారు. సామ్ కూడా ఈ వీడియోపై స్పందించింది.

నాగ‌చైత‌న్యగ‌త చిత్రాల‌కు పూర్తి భిన్నంగా ఈ చిత్రంలో క‌నిపిస్తున్నాడు. ఈ సినిమాతో సాయిప‌ల్ల‌వి, చైత‌న్య‌ క‌లిసి మ్యాజిక్ చేయ‌బోతున్న‌ట్టే క‌నిపిస్తోంది. తెలంగాణ గ్రామీణ నేప‌థ్యం నుంచి హైద‌రాబాద్ వ‌చ్చిన ఓ జంట‌గా ఈ ఇద్ద‌రు ఈ చిత్రంలో క‌నిపించ‌బోతున్నారు. తెలుగులో ప్రేక్ష‌కుల‌కు మ‌రోసారి ఈ సినిమాతో స‌రికొత్త అనుభూతిని అందించ‌బోతున్న శేఖ‌ర్ క‌మ్ముల ఈ చిత్రాన్ని స‌మ్మ‌ర్‌కు ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురాబోతున్నాడు.

#AyPilla Musical Preview | Love Story Movie | Naga Chaitanya,Sai Pallavi | Sekhar Kammula | Pawan Ch