చిరంజీవి నటిస్తున్న భారీ చిత్రం `ఆచార్య`కు మళ్లీ భారీ షాక్ తగిలినట్టు తెలుస్తోంది. కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ప్రారంభ దశ నుంచే వార్తల్లో నిలుస్తోంది. కారవాన్‌ల వివాదం కారణంగా తొలి రోజుల్లో ఈ సినిమాపై పెద్ద రచ్చే జరిగింది. ఆ తరువాత కీలక అతిథి పాత్ర విషయంలోనూ నాన్నా పులి తరహా డ్రామానే నడిచింది.
ఈ చిత్రంలో 30 నుంచి 40 నిమిషాల నిడివిగల కీలక అతిథి పాత్రని రామ్‌చరణ్ చేత చేయించాలనుకున్నారు. అయితే అందుకు రాజమౌళి `ఆర్ ఆర్ ఆర్` అడ్డంకిగా మారడంతో ఆ స్థానంలో మహేష్‌ని తీసుకోవాలని సంప్రదింపులు కూడా జరిపారు. రెమ్యునరేషన్ భారీగా కోట్ చేయడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. ఆ తరువాత ఇందులో హీరోయిన్‌గా చిరుకు జోడీగా నటించాల్సిన త్రిష క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా ఈ చిత్రం నుంచి తప్పుకుంటున్నానని బహిరంగంగా ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది.
ఆ తరువాత హీరోయిన్‌గా అనుష్కని సంప్రదించారు. తను అంగీకరించకపోవడంతో చివరికి కాజల్‌ని తీసుకున్నారు. తాజాగా `ఆచార్య` టీమ్‌కు కాజల్ కూడా షాక్ ఇచ్చినట్టు తెలుస్తోంది. కాజల్ చేతిలో ప్రస్తుతం నాలుగు చిత్రాలున్నాయి. అవి ఇంకా చిత్రీకరణ దశలోనే వున్నాయి. కరోనా కారణంగా వాటి షెడ్యూల్స్ మారబోతున్నాయి. ఈ నేపథ్యంలో వాటిని పక్కన పెట్టి `ఆచార్య`కు డేట్స్ కేటాయించడం కష్టం. కాబట్టి ఈ సినిమా నుంచి తప్పుకోవాలని కాజల్ భావిస్తోందట.