గ్యాప్‌ తప్ప ముగింపులేని కెరీర్ మాది!

తెలుగు, తమిళ భాషల్లో  కథానాయికగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మిల్కీ బ్యూటీ తమన్నా..   బాలీవుడ్‌లో మాత్రం ఆశించిన స్థాయిలో విజయాల్ని అందుకోలేకపోయింది. దీంతో బాలీవుడ్‌లో ఆమె కెరీర్‌ ఇక ముగిసిపోయిందంటూ.. సోషల్ మీడియాలో  నెటిజన్లు తెగ కామెంట్స్‌ పెడుతున్నారు. వీటికి తమన్నా తన సహజ ధోరణీలోనే స్పందించింది.. “బాలీవుడ్‌లో నా పని అయిపోయిందంటూ  నెటిజన్లతోపాటు.. బాలీవుడ్‌ వర్గాలు కూడా  సోషల్‌ మీడియాలో  కామెంట్స్‌ పోస్ట్‌ చేస్తున్నారు.  అంటే బాలీవుడ్‌లో నా కెరీర్‌ ముగిసిందనే అభిప్రాయంలో వాళ్ళంతా ఉన్నారు. ఇలాంటి వాళ్ళకి నేను చెప్పేదొకటే..
 
గ్యాప్‌ తప్ప ముగింపులేని కెరీర్ మాది. ఆర్టిస్ట్‌కి కెరీర్‌లో కొంత బ్రేక్‌ తప్ప, ముగింపు ఉండదు. గత కొన్నేండ్లుగా 365 రోజులూ నేను షూటింగ్‌ల్లో పాల్గొంటూనే ఉన్నాను. ఈ క్రమంలో ఎన్నో తెలుగు, తమిళ చిత్రాలను చేశాను. అయితే డేట్లను సర్దుబాటు చేయలేక బాలీవుడ్‌లో నటించలేదు. అంతేతప్ప, బాలీవుడ్‌లో అవకాశాలు రాక కాదు.  ఆర్టిస్ట్‌కి కెరీర్‌లో గ్యాప్‌ తప్ప ముగింపు ఉండదు” అని తమన్నా తెలిపింది.  గోపీచంద్‌ హీరోగా సంపత్‌ నంది దర్శకత్వంలో ‘సీటీమార్‌’ అనే చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో తెలంగాణ మహిళల కబడ్డీ జట్టు కోచ్‌ జ్వాల పాత్రలో నటిస్తున్నారు తమన్నా. తమన్నా కెరీర్‌లో తొలిసారి ఓ స్పోర్ట్స్‌ బ్యాక్‌డ్రాప్‌ సినిమా చేస్తోంది.  తెలంగాణ యాస నేర్చుకోవడాన్ని ఓ సవాల్‌గా తీసుకుందట.  
 
శాకాహారిగా మారిపోయి, గ్లూటెన్‌ డైట్‌ ఫాలో అవుతూ యోగా కూడాచేస్తోందిట. కోచ్‌గా  హావభావాలు, బాడీ లాంగ్వేజ్‌ పర్ఫెక్ట్‌గా ఉండేందుకు జాగ్రత్త పడుతున్నానంటోంది.’జ్వాల’ క్యారెక్టర్‌ ప్రేక్షకులకు గుర్తుండిపోవాలనే ఛాలెంజింగ్‌గా తీసుకుని చేస్తున్నానంటోంది. అందుకే ఈ పాత్ర కోసం జాతీయ స్థాయి కబడ్డీ ప్లేయర్స్‌ సలహాలను తీసుకుందట.  అలాగే … తమన్నా తొలి వెబ్‌ సిరీస్‌ ‘ది నవంబర్స్‌ స్టోరీ’. ఇదొక క్రైమ్‌ థిల్లర్‌. తమిళంలో రూపొందుతున్న ఈ సిరీస్‌కు రామ్‌ సుబ్రమణియన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో తండ్రిని కాపాడే కూతురి పాత్రలో నటిస్తున్నారు తమన్నా.
 
అనుకోకుండా ఓ క్రైమ్‌లో ఇరుక్కున్న తండ్రిని కాపాడటానికి కూతురిగా తన వంతు ప్రయత్నం చేస్తున్నారు. మరి ఈ క్రైమ్‌ని ఛేదించి, తన తండ్రిని నిర్దోషిగా ఎలా నిరూపిస్తారనేది తెలియడానికి కొంచెం టైమ్‌ ఉంది. ఈ సిరీస్‌ ఫస్ట్‌ షెడ్యూల్‌ చిత్రీకరణ పూర్తయింది. ”తొలి షెడ్యూల్‌ను పూర్తి చేశాం. తదుపరి షెడ్యూల్‌ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను” అని పేర్కొన్నారు తమన్నా. ‘హాట్‌స్టార్‌’లో ఈ సిరీస్‌ తెలుగు, హిందీ భాషల్లోనూప్రసారం కానుందట. అల్ ది బెస్ట్ తమన్నా!?