ఈ సంక్రాంతి కోడి పందేలా తరహాలోనే బాక్సాఫీస్ వద్ద భారీ సినిమాల పోటీ మొదలైంది. ఇప్పటికే తలైవర్ `దర్బార్`తో షేకాడించేశారు. ఆ తరువాత వరుసలో వచ్చిన మహేష్ `సరిలేరు నీకెవ్వరు`తో కలెక్షన్‌ల మోత మోగించేస్తున్నారు. ఇక 12న రిలీజ్ అయిన అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కలయికలో వచ్చిన `అల వైకుంఠపురములో` కూడా ప్రీమియర్ షోల నుంచే రికార్డులు సృష్టించడం మొదలుపెట్టింది.
ఇదిలా వుంటే ఈ మూడు సినిమాల తరువాత ఈ నెల 15న `ఎంత మంచి వాడవురా!` వచ్చేస్తోంది. నందమూరి కల్యాణ్‌రామ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని వేగేశ్న సతీష్ నిర్మిస్తున్నారు. ఆదిత్య మ్యూజిక్ అధినేత ఉమేష్ గుప్త ఈ సినిమాతో తొలి సారి నిర్మాణ రంగంలోకి ప్రవేశిస్తున్నారు. శివ లెంక కృష్ణ ప్రసాద్ సమర్పకుడిగా వ్యవహిరిస్తున్న ఈ సినిమాపై ప్రారంభం నుంచి బజ్ లేదు. ఎంత ఎన్టీఆర్ ప్రీరిలీజ్ ఫంక్షన్‌కి వచ్చినా బజ్ క్రియేట్ చేయలేకపోయారు.
బయటికి వచ్చిన టాక్‌ని బట్టి సినిమా రొటీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అని, కొత్తగా చెప్పుకోవాల్సిన అంశాలు ఇందులో ఏ మాత్రం లేవని ఫిల్మ్ నగర్ టాక్. గుజరాతీ చిత్రం `ఆక్సిజన్` స్ఫూర్తితో ఈ చిత్ర కథని రాసుకున్నారట. మంచితనానికి కేరాఫ్ అడ్రస్‌గా మారే ఓ యువకుడి జీవితం నేపథ్యంలో కథ సాగుతుందని, తెలుగులో ఇప్పటి వరకు ఇలాంటి చిత్రాలు చాలానే వచ్చాయని, పైగా సంక్రాంతి బరిలో నిలిచిన దర్బార్, సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో చిత్రాల మధ్య కల్యాణ్‌రామ్ సినిమా నిలబడటం అంత ఈజీ కాదు అన్నది ఫిల్మ్ నగర్ టాక్.