కరోనా ప్రపంచాన్ని అల్లకల్లోలం చేస్తోంది. దీని ధాటిని నుంచి యావత్ భారతాన్ని ఎలా విముక్తి చేయాలా అని దేశ ప్రధాని నుంచి రాష్ట్రాధినేతల వరకు అహర్నిశలు శ్రమిస్తున్నారు. వీరందరికి మించి డాక్టర్లు, నర్సులు, పోలీసులు, పారిశుద్య కార్మికులు ప్రాణాలకు తెగించి పనిచేస్తున్నారు. వారందరికీ సంఘీభావం తెలుపుతూనే కరోనా వైరస్ విముక్తి కోసం జనతా కర్ఫ్యూను పాటించాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. దీనికి పలువురు సినీ ప్రముఖులు సంఘీభావం తెలుపుతూ వీడియో సందేశాలిస్తున్నారు.
దీనిపై ముందుగా చిరు స్పందించారు. కరోనా వైనస్‌ని నివారించడానికి క్షేత్ర స్థాయిలో అహర్నిశలు శ్రమిస్తున్న వైద్యులకు, నర్సులకు, పోలీసులులకు, పారిశుద్య కార్మికులకు, ఆయా ప్రభుత్వాలకు సంఘీభావం ప్రకటిస్తూ ప్రశంసించాల్సిన సమయమిది. దేశ ప్రధాని పిలుపుకు స్పందిస్తూ ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మన మందరం స్వచ్ఛందంగా జనతా కర్ఫ్యూని పాటిద్దాం. ఇళ్లకే పరిమితం అవుదాం. మన కోసం సేవలందిస్తున్న వారికి సరిగ్గా సాయంత్రం ఐదు గంటలకు మన ఇంటి గుమ్మాల్లోకి వచ్చి కరతాళ ధ్వనులతో సంఘీభావం తెలుపుదాం. అది మన ధర్మం. భారతీయులుగా మనమందరం ఐకమత్యంతో ఒకటిగా నిలబడి క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొందాం. సామాజిక సంఘీభావం పలుకుదాం. కరోనా విముక్త భారతాన్ని సాధిద్దాం` అన్నారు.
ఇలాంటి క్లిష్టపరిస్థితుల్లో మనల్ని రక్షించడానికి తమని తాము పణంగా పెట్టి సేవ చేస్తున్న ఎన్నో డ్రేవ్ హార్టెడ్ పీపుల్స్‌కి సెల్యూట్ చేద్దాం. ప్రధాని పలుపు మేరకు మార్చి 22న ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు ఇంటికే పరిమితం అవుదాం. అలాగే వారికి కరతాళధ్వనులతో సంఘీభావం తెలుపుదాం అని మహేష్ వెల్లడించారు.