క్రిష్ క్రేజీ హీరోయిన్‌ని ఫిక్స్ చేశాడు!

రెండేళ్ల విరామం త‌రువాత ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ మ‌ళ్లీ వ‌రుస ప్రాజెక్ట్‌ల‌తో వేగం పెంచారు. దిల్ రాజుతో క‌లిసి బోనీ క‌పూర్ నిర్మిస్తున్న బాలీవుడ్ హిట్ ఫిల్మ్ `పింక్‌` రీమేక్‌లో న‌టిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ రాకెట్ స్పీడుతో జ‌రిగిపోతోంది. ఇందులో ప‌వ‌న్ ప‌వ‌ర్ఫుల్ లాయ‌ర్‌గా క‌నిపించ‌బోతున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రానికి `వ‌కీల్‌సాబ్‌` అనే టైటిల్ ప‌రిశీల‌న‌లో వుంది. ఇదిలా వుంటే ఈ సినిమాతో పాటు ప‌వ‌ర్‌స్టార్ ఓ పీరియ‌డ్‌ చిత్రాన్ని కూడా చేస్తున్నారు.

వ‌రుస ఫ్లాపుల‌తో కొంత వెన‌క‌బ‌డిన క్రిష్ ఈ సినిమాతో త‌నేంటో నిరూపించుకోవాల‌ని, త‌న‌పై వ‌చ్చిన విమ‌ర్శ‌ల‌కు ఓ భారీ హిట్‌తో స‌మాధానం చెప్పాలన్న క‌సితో ఈ సినిమా చేస్తున్నాడు. ఏ.ఎం. ర‌త్నం నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్ కూడా చ‌క‌చ‌కా జ‌రిగిపోతోంది. తెలంగాణ రాబిన్‌హుడ్‌గా పేరున్న పండ‌గ‌ల సాయ‌న్న క‌థ‌గా ఈ సినిమాని రూపొందిస్తున్నార‌ని, ప‌వ‌న్ ఇందులో బందిపోటుగా క‌నిపిస్తార‌ని ఇప్ప‌టికే ప‌లు వార్త‌లు బ‌య‌టికి వ‌చ్చి సినిమాపై అంచ‌నాల్ని పెంచేశాయి.

ఇదిలా వుంటే ఈ సినిమా కోసం ప‌వ‌న్‌కు జోడీగా కీర్తి సురేష్‌ని ఎంపిక చేసిన‌ట్టు తెలిసింది. ఇటీవ‌ల ఈ చిత్రం కోసం బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌, ప్ర‌గ్యాజైస్వాల్‌ల‌ని ఎంపిక చేశార‌ని వార్త‌లు వినిపించాయి. అయితే పిరియ‌డ్ సినిమాకు కీర్తి సురేష్ అయితేనే బాగుంటుంద‌ని భావించిన క్రిష్ ఫైన‌ల్‌గా ప‌వ‌న్‌కు జోడీగా కీర్తిసురేష్‌ని ఫైన‌ల్ చేసిన‌ట్టు తెలిసింది.