డిజిటల్ ప్లాట్ ఫామ్స్ నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ భారతీయ సినిమా మార్కెట్ ని ప్రభావితం చేస్తున్న విషయం తెలిసిందే. వీటికి తోడు ఇండియాకు చెందిన, జీ 5 వంటి సంస్థలు డిజిటల్ ప్రపంచాన్ని శాసిస్తున్నాయి. ఏ కొత్త సినిమా రిలీజ్ అయినా ఈ ఓటీటీ ప్లాట్ ఫామ్స్‌లో ఏదో ఒకదాంట్లో స్ట్రీమింగ్ కావాల్సిందే. దాదాపు నెల నుంచి 50 రోజుల తరువాత కొత్త సినిమాల్ని డిజిటల్ ప్లాట్ ఫామ్స్‌లో ప్రదర్శించాలన్నది నిర్మాతల ప్రతిపాదన. అయితే ఆ ప్రతి పాదనని అమెజాన్‌తో సహా నెట్‌ఫ్లిక్స్, జీ 5 పాటించడం లేదు. ఇటీవల విడుదలైన ఆది సాయికుమార్ చిత్రం `ఆపరేషన్ గోల్డ్ ఫిష్` థియేటర్లలో వుండగానే కేవలం 15 రోజుల్లోనే అమెజాన్ ప్రైమ్‌లో వచ్చేసింది.
వెంకటేష్, వరుణ్‌తేజ్ నటించిన `ఎఫ్2` థియేటర్లలో వసూళ్ల వర్షం కురిపిస్తుండగానే అమెజాన్ రిలీజ్ చేసేసి ఆ సినిమా వసూళ్లపై భారీ దెబ్బ కొట్టింది. ఇలా చాలా సినిమాలు అగ్రిమెంట్‌కి విరుద్ధంగా డిజిటల్ ప్లాట్ ఫామ్‌లు ప్రదర్శిస్తుండటంతో ఆలోచనలో పడ్డ అల్లు అరవింద్, డి. సురేష్‌బాబు, దిల్ రాజు, యువీ, మైత్రీ సంస్థల అధినేతలు.. ఎల్ ఎల్ పీలో వున్న చాలా మంది బిగ్ ప్రొడ్యూసర్స్ మై హోమ్ అధినేతతో కలిసి సొంతంగా ఓటీటీ ప్లాట్ ఫామ్‌ని ఏర్పాటు చేసుకోవాలని ప్లాన్ చేశారు. అయితే ఆ ప్లాన్ ప్రకారం మాత్రం ఎవరూ నడుచుకోవడం లేదు.
ఎంత ఎక్కువ కోట్ చేస్తే వారికి ఇచ్చేయడం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. మొదటి నుంచి అమెజాన్ ప్రైమ్‌ని వ్యతిరేకిస్తున్న డి. సురేష్‌బాబు `వెంకీమామ` చిత్రాన్ని భారీ రేటుకు అదే సంస్థకు కట్టబెట్టారు. గత ఏడాది డిసెంబర్ 13న రిలీజ్ అయినా ఈ చిత్రాన్ని జనవరి 13న అమెజాన్ ప్రైమ్ ఆన్‌లైన్‌లో రిలీజ్ చేసింది. ఇక ఎస్. రాధాకృష్ణతో కలిసి `అల వైకుంఠపురములో` చిత్రాన్ని నిర్మిస్తున్న అల్లు అరవింద్ ఈ చిత్ర డిజిటల్ రైట్స్‌ని నెట్ ఫ్లిక్స్‌కి అమ్మేశారట. `సరిలేరు నీకెవ్వరు` చిత్రాన్ని అనిల్ సుంకరతో కలిసి దిల్ రాజు నిర్మించారు. భారీ బడ్జెట్ సినిమా కావడంతో ఈ చిత్ర డిజిటల్ రైట్స్‌ని నెట్‌ఫ్లిక్స్‌కి ఇచ్చేశారట. డిజిటల్ ప్లాట్ ఫామ్ అంటూ హంగామా చేసిన వీరే చేతులెత్తేస్తే మిగతా వారి పరిస్థితి ఏంటని ఇండస్ట్రీలో సెటైర్లు వినిపిస్తున్నాయి.