ఇండస్ట్రీలో ఏం జరిగినా ఆ పంచాయితీ దాసరి వున్న కాలంలో ఆయన ఇంటికి చేరాల్పిందే. అప్పట్లో ఇండస్ట్రీకి ఆయన పెద్దన్నగా వ్యవహరించేవారు. ఎలాంటి సమస్యనైనా నయాన్నో భయాన్నో పరిష్కరించేవారు. దాసరి మాట అన్నారంటే మిగతా వారు ఖచ్చితంగా వినాల్సిందే. పరిస్థితులు అలా వుండేవి. ఆయనపై గౌరవంతో కొంత మంది.. భయంతో కొంత మంది దాసరి చెప్పిన పరిష్కారానికి తలూపేవారు. సమస్య పరిష్కారం అయిపోయేది. దాసరి తరువాత పెద్దన్న పాత్రని ఇప్పుడు చిరంజీవి పోషిస్తున్నారు. కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో సినీ వర్కర్స్ పనులు లేక విలవిలలాడుతున్నారు. వారికి సహాయం చేయడం కోసం స్టార్స్ విరాళాలు ప్రకటిస్తున్నారు.
గత కొంత కాలంగా చిరు స్వచ్ఛందంగా స్పందిస్తూ కార్మికులు, దర్శకుల కోసం నిధుల్ని అందించారు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకున్న దర్శకుల సంఘం అధ్యక్షుడు ఎన్. శంకర్, సీనియర్ దర్శకుడు, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, డిజ సురేష్ బాబుతో కలిసి సీసీసీ పేరుతో కరోనా క్రైసిస్ చారిటీ పేరుతో ఓ సంస్థని ఏర్పాటు చేశారు. దీనికి చైర్మన్‌గా మెగాస్టార్ చిరంజీవి వ్యవహరించనున్నారు. సినీ కార్మికుల కోసం ఇప్పటికే చిరంజీవి కోటి రూపాయల్ని విరాళంగా ప్రకటించారు. ఆయన అడుగుజాడల్లో నడిచే నాగార్జున కూడా తాజాగా కోటీ రూపాయల్ని విరాళంగా ప్రకటించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. నాగ్‌తో పాటు స్టార్ హీరోలు మహేష్, ఎన్టీఆర్ కూడా తలా 25 లక్షలు ప్రకటించడంతో మరి కొంత మంది కూడా భారీ స్థాయిలో విరాళాలు ప్రకటించే అవకాశం వుందని, ఈ డబ్బుతో కార్మికుల సహాయార్థం పలు కార్యక్రమాల్ని నిర్వహించనున్నామని ఎన్.శంకర్, తమ్మారెడ్డి భరద్వాజ ఓ ప్రకటనలో తెలియజేశారు.