దేశ వ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టంపై ఆందోళనలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇటీవల జేఎన్‌యూలో జరిగిన దాడి కలకలం రేపింది. దీనిపై విద్యార్థ సంఘాలు, సెలబ్రిటీలు స్పందిస్తున్నారు. తాజాగా జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలోకి కొంత మంది అగంతకులు చొరబడి విద్యార్థులు, అద్యాపకులపై దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దాడి పట్ల సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. తాజాగా ఈ వివాదంపై హీరో అల్లు అర్జున్ కూడా స్పందించారు,
`అ వైకుంఠపురములో` సినిమాలో నటిస్తున్నారు. ఈ నెల 12న రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా అడిగిన ప్రశ్నకు తెలివిగా సమాధానం చెప్పారు అల్లు అర్జున్. జేఎన్‌యూలో జరిగిన దాడి గురించి తెలిసి తాను ఎంతో బాధపడ్డానని, ఈ సమస్యకు సరైన పరిష్కారం వుంటుందని భావిస్తున్నానని పేర్కొన్నారు. పౌరసత్వ ఆందోళనలపై కూడా స్పందించారు. `నేను ఎప్పుడూ నిజాయితీగానే వుంటాను. ఇటీవల ఈ విషయం గురించి అజయ్‌దేవగన్ చెప్పిన మాటలు నా కెంతో నచ్చాయి. ఏది ఏమైనా మేమందరం సినిమాలతో ప్రేక్షకుల్ని ఎంటర్‌టైన్ చేసేవాళ్లం, మాకూ గొంతుంటుంది. ఇలాంటి సంఘటనల గురించి మాట్లాడే శక్తి కూడా వుంటుంది. కాకపోతే ఇలాంటి విషయాల గురించి మేము చాలా జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలి. లేదంటే చిక్కుల్లో పడతాం` అన్నారు.