`బాహుబలి`తో తెలుగు సినిమా ఖ్యాతి ఖండాంతరాలకు పాకింది. తెలుగు సినిమా బిజినెస్ కూడా ఎల్లు దాటేసింది. `బాహుబలి` తరువాత ఇక్కడ సినిమా క్లాప్ కొడుతున్నారంటే ఎక్కడెక్కడి నుంచో ఎంక్వైరీలు మొదలవుతున్నాయి. తాజాగా `ఆర్ ఆర్ ఆర్` పరిస్థితి అలాగే వుంది. దేశ చరిత్రలో అమర వీరులుగా నిలిచిపోయిన ఇద్దరు ధీరోదాత్తుల పోరాటాన్ని, వారు గడిపిన అజ్ఞాత జీవితం తాలూకూ ఫిక్షనల్ కథని `ఆర్ ఆర్ ఆర్`తో రాజమౌళి వెండితెరపై ఆవిష్కరిస్తున్నారు.
దీంతో ఈ సినిమాపై సహజంగానే అంచనాలు తారా స్థాయికి చేరుకున్నాయి. పైగా యంగ్‌టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ తొలిసారి కలిసి నటిస్తుండటంతో దేశ వ్యాప్తంగా అంచనాలు స్కై హైకి చేరుకున్నాయి. ట్రేడ్ వర్గాల్లోనూ ఈ సినిమా ప్రకంపనలు సృష్టిస్తోంది. సినిమా చిత్రీకరణ దశలో వుండగానే ఏరియాల వారిగా పోటీ నెలకొంది. ఈ ఏరియా నాకు కావాలంటే నాకు కావాలని డిస్ట్రిబ్యూటర్స్ పోటీపడుతున్నారు. ఈ సినిమా విషయంలో ఇప్పటి వరకు జరిగిన బిజినెస్ ట్రేడ్ పండితుల్ని విస్మయానికి గురిచేస్తోంది.
నైజాం, కర్ణాటక, సీడెడ్, వైజాగ్, ఏవర్సీస్.. ఈ ఏరియాల్లో మొత్తం బిజినెస్ ఇప్పటి వరకు 270 కోట్లు జరిగినట్టు తెలుస్తోంది. నైజాం 75 కోట్లు డిమాండ్ చేయడంతో దిల్ రాజు అంత మొత్తం ఇవ్వడానికి సిద్ధపడినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఎంత మంది పోటీకి వచ్చినా దిల్ రాజు మాత్రం 75 కోట్లు పెట్టడానికి ఏ మాత్రం వెనుకాడకపోవడం షాక్‌కు గురిచేస్తోంది. 75 పెడితే అంత మొత్తం రిటర్న్స్ వస్గాయా అని కొంత మంది అనుమానం వ్యక్తం చేస్తున్నారట. ఇదే పోటీ ఓవర్సీస్ విషయంలోనూ నెలకొందని దీన్ని కూడా 75 కోట్లకు అమ్మేశారని తెలిసింది. కర్ణాటక 50 కోట్లు, సీడెడ్ 40 కోట్లు, వైజాగ్ 30 కోట్లకు బిజినెస్ జరిగిందని ప్రచారం జరుగుతోంది. ఇలా ఓ తెలుగు సినిమాకు రిలీజ్ ముందే ఈ స్థాయిలో బిజినెస్ జరగడం ఓ రికార్డ్.