‘అల వైకుంఠపురంలో..’ విడుదల తేదీ ఖరారు

‘అల వైకుంఠపురంలో..’రిలీజ్ ఎప్పుడంటే…

అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం అల వైకుంఠపురంలో. ఇప్పటికే సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ ని విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది . ఈ క్రమంలో సినిమా రిలీజ్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. అందుతున్న సమాచారం మేరకు ఈ చిత్రాన్ని జనవరి 12న ప్రేక్షకుల ముందుకు తేవాలని దర్శక,నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారట. ఈ మేరకు ప్లాన్ చేసి పనులు చేస్తున్నారట. అయితే ఈ విషయమై చిత్ర నిర్మాణ సంస్థ నుండి ఇంకా ఆఫీషియల్ ప్రకటన రావాల్సి ఉంది.

ఇదిలా ఉంటే ఈ చిత్రం ఆడియోని నవంబర్లో విడుదల చేయనున్నారు. ఇక టీజర్ ని నవంబర్ 7 వ తేదీన త్రివిక్రమ్ పుట్టిన రోజు కానుకగా విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఆ ప్లాన్ మారిందని సమాచారం. అక్టోబర్ 8 విజయదశమి కానుకగా విడుదల చేయాలని టీమ్ డెసిషన్ తీసుకున్నట్లు సమాచారం.

గతంలో బన్నీ, త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన ‘జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి’ చిత్రాలు మంచి హిట్లుగా నిలవడంతో ఈ సినిమాపై భారీ హైప్ నెలకొని ఉంది. ఈ సినిమాలో బన్నీ క్లాసా ? మాసా.. ? అనే చర్చ జరుగుతోంది. బన్నీ పాత్రను త్రివిక్రమ్ ‘రౌడీ అల్లుడు’ మూవీలో చిరంజీవి పాత్ర గుర్తు వచ్చేలా డిజైన్ చేసాడంటున్నారు.

బన్నీ 19వ చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో అల్లు అర్జున్‌కు జోడీగా పూజాహెగ్డే నటిస్తున్నారు. వీరిద్దరూ ఇంతకు ముందు ‘దువ్వాడ జగన్నాథం(డీజే)’లో కలిసి నటించారు. టబు, జయరాం, నివేదా పేతురాజ్‌, సుశాంత్‌, సునీల్‌ తదితరులు ఈ చిత్రంలో ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌, గీతా ఆర్ట్స్‌ పతాకాలపై ఎస్‌.రాధాకృష్ణ, అల్లు అరవింద్‌ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు.