అల్ల‌రోడి కోసం కొరియన్ సినిమాని ప‌ట్టేశారు!

అల్ల‌రి న‌రేష్ కెరీర్ ప్ర‌స్తుతం ప్ర‌శ్నార్థ‌కంలో ప‌డిపోయింది. గ‌త కొంత కాలంగా అత‌ను న‌టించిన చిత్రాలేవీ ఆశించిన విజ‌యాన్ని సాధించ‌డం లేదు. దాంతో కొంత విరామం తీసుకున్న అల్ల‌రోడు వ‌రుస‌గా విభిన్న‌మైన చిత్రాల్ని అంగీక‌రిస్తున్నారు. ఇటీవ‌ల `నాంది` పేరుతో ఓ థ్రిల్ల‌ర్ చిత్రాన్ని మొద‌లుపెట్టిన అల్ల‌రి న‌రేష్ ఇంత‌కు ముందే `బంగారు బుల్లోడు`ని కూడా ప‌ట్టాలెక్కించాడు.

అయితే గ‌తేడాది మొద‌లైన ఈ సినిమా షూటింగ్ అనూహ్య ప‌రిణామాల మ‌ధ్య‌ న‌త్త‌నడ‌క‌న సాగుతోంది. ఇదిలా వుంటే అల్ల‌రిరోడితో ఓ వెరైటీ చిత్రాన్ని నిర్మించాల‌ని సురేష్ నంకొడ‌క్ష్సన్స్ అధినేత డి. సురేష్ బాబు ప్లాన్ చేస్తున్నార‌ట‌. ఇప్ప‌టికే ఓ కొరియ‌న్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయ‌డం కోసం రైట్స్ తీసుకున్నారని తెలిసింది. 2012లో వ‌చ్చిన కొరియ‌న్ చిత్రం `డ్యాన్సింగ్ క్వీన్‌`. ఈ చిత్ర తెలుగు రీమేక్ హ‌క్కుల్ని సొంతం చేసుకున్న సురేష్ బాబు ఇందులో హీరో పాత్ర కోసం అల్ల‌రి న‌రేష్‌ని ఫిక్స్ చేశార‌ట‌.

ఇక టైటిల్ పాత్ర‌లో క్వీన్‌గా కాజ‌ల్ అగ‌ర్వాల్ అయితే బాగుంటుంద‌ని భావించిన సురేష్‌బాబు ఇటీవ‌లే ఓ ప్ర‌పోజ‌ల్‌ని కాజ‌ల్ ముందు పెట్టార‌ట‌. డీల్ న‌చ్చ‌డంతో కాజ‌ల్ కూడా ఈ చిత్రానికి గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టు తెలిసింది. మ‌రి ఈ రీమేక్‌ని ఎవ‌రు తెర‌కెక్కిస్తారు?, మిగ‌తా న‌టీన‌టులు ఎవ‌రు? అన్న వివ‌రాల్ని చిత్ర బృందం త్వ‌ర‌లోనే వెల్ల‌డిస్తారని తెలిసింది.