స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ఓ భారీ పాన్ ఇండియా చిత్రాన్ని తెరపైకి తీసుకొస్తున్న విషయం తలిసిందే. మైత్రీమూవీమేకర్స్‌తో పాటు ముత్యంశెట్టి మీడియా ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తోంది. ఈ చిత్రానికి `పుష్ప` అనే టైటిల్‌ని చిత్ర బృందం ఖరారు చేసి బన్నీ పుట్టిన రోజు సందర్భంగా బుధవారం ఫస్ట్ లుక్ పోస్టర్‌ని రిలీజ్ చేసింది. బన్నీ, సుకుమార్‌ల కలయికలో ఆర్య, ఆర్య-2 వంటి విభిన్నమైన చిత్రాలు రూపొందాయి. ఇది వీరిద్దరి కలయికలో వస్తున్న మూడవ చిత్రం.
ఈ క్రేజీ కాంబినేషన్ ముచ్చటగా మూడవ సారి కలిసి పనిచేస్తున్న చిత్రం కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమా ప్రారంభానికి ముందు నుంచే ఈ చిత్రం సంచలనంగా మారింది. ఇందులో బన్నీకి జోడీగా రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. బన్నీ కెరీర్‌లోనే తొలిసారి ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, హిందీ, యలయాళ, కన్నడ భాషల్లో పాన్ ఇండియా స్థాయి చిత్రంగా రిలీజ్ చేయబోతున్నారు.
శేషాచలం అడవుల్లో గంధపు చక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో బన్నీ పాత్ర ఊరమాస్‌గా కనిపించబోతోంది. చాలా రగ్గ్‌డ్‌గా వుంటుందని ఫస్ట్ లుక్ పోస్టర్‌ని చూస్తే తెలిసిపోతోంది. ఇటీవల వచ్చిన `ఖైదీ` చిత్రంలో కార్తి పాత్రని పోలి కనిపిస్తోంది. గుబురు గడ్డం, గుబురు మీసం, బుట్టలా పెరిగిన జుట్టు. పైగా బన్నీ వేసుకున్న షర్ట్ సినిమా `రంగస్థలం` తరహాలో పిరియాడిక్ ఫిల్మ్‌గా తెలుస్తోంది. ఇందులో బన్నీ పాత్ర పేరు పుష్పరాజ్. అందుకే ఈ చిత్రానికి `పుష్ప` అనే టైటిల్‌ని ఫైనల్ చేశారు. టైటిల్ డిజైన్‌ని బట్టి చూస్తే వేలి ముద్ర గుర్తు కనిపిస్తోంది. అంటే బన్నీ ఇందులో చదువురాని వేలి ముద్రగాడిగా కనిపిస్తాడని అర్థమవుతోంది.
`అల వైకుంఠపురములో` చిత్రంతో ఇండస్ట్రీ హిట్‌ని సొంతం చేసుకున్న బన్నీ ఈ సినిమాతో పాన్ ఇండియా స్థాయి హిట్‌పై కన్నేసినట్టు కనిపిస్తోంది. ఆ ప్లాన్‌లో భాగంగానే ఈ చిత్రాన్ని ఐదు భాషల్లో రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. లాక్ డౌన్‌కారణంగా రెండవ షెడ్యూల్ ఆలస్యం అవుతున్న ఈ చిత్రాన్ని త్వరలోనే ప్రారంభించి త్వరితగతిన పూర్తి చేయాలని సుకుమార్ ప్లాన్ చేస్తున్నారు.