నాగార్జున, పూరి జగన్నాథ్‌ల కలయికలో వచ్చిన చిత్రం `సూపర్`, 2005లో వచ్చిన ఈ సినిమా ద్వారా బెంగళూరు యోగా టీచర్ అనుష్క తెలుగు తెరకు పరిచయమైంది. అయితే ఆమె అసలు పేరు అనుష్క కాదని స్వీటీ అని పూరి జగన్నాథ్ అసలు విషయం బయటపెట్టాడు. అనుష్క సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి 15 ఏళ్లు అవుతున్న సందర్భంగా ఆమె నటిస్తున్న తాజా చిత్రం `నిశ్శబ్దం` చిత్ర బృందం స్వీటీ 15 జర్నీ పేరుతో ఓ కార్యక్రమాన్ని గురువారం రాత్రి నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న పూరి జగన్నాథ్ అనుష్క పేరు వెనకున్న అసలు స్టోరీని బయటపెట్టేశాడు. `సూపర్` సినిమాలో హీరోయిన్ కోసం ముంబైలో ఆడిషన్స్ కి పూరీ వెళ్లాడట. అక్కడ ఓ వ్యక్తి ద్వారా ఆడిషన్‌కి వచ్చిన అమ్మాయే స్వీటీ. అమ్మాయి బాగుంది. యాక్టింగ్ వచ్చా అంటే రాదు. . ఏమో చూడాలి, డ్యాన్స్ వచ్చా అంటే ఏమో తెలియదు చూడాలి.. అని నాకే టాస్క్‌లిస్తోంది అని భావించిన పూరి మొత్తానికి స్వీటీని హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్‌కి తీసుకొచ్చి నాగార్జునకు చూపించాడట.
చూడ్డానికి బాగానే వుంది ఇంకా ఆడిషన్ ఎందుకని నాగార్జున అన్నారని. అమ్మాయి ఏదీ రాదని ట్విస్ట్‌లిస్తోంది. ఆడిషన్ చేద్దామన్నానని పూరి చెప్పాడు. ఆ తరువాత కొన్ని రోజులు వినోద్ బాల వద్ద యాక్టింగ్ నేర్పించామని ఆ తరువాతే సినిమాలోకి తీసుకున్నామని అయితే ఆమె పేరుని స్క్రిన్‌పై అనుష్కగా మార్చింది తాను, నాగార్జుననే అని, అసలు మాకు ఆ పేరు తట్టింది ఛానల్ వి లో పాటలు పాడే అనుష్క అనే అమ్మాయి వల్లేనని అనుష్క పేరు వెనకున్న అసలు సీక్రెట్‌ని బయటపెట్టేశాడు. అనుష్క నటించిన `నిశ్శబ్దం` చిత్రం ఏప్రిల్ 2న విడుదల కాబోతోంది.