అదే జోష్.. అదే హుషారు.. జాక్ పాట్ కొడ‌తాడా?

తేజ్‌ హుషారు ఎక్క‌డా త‌గ్గ‌లేదుగా!

టాలీవుడ్ మ‌హా స‌ముద్రం లాంటిది. ఇక్క‌డికి ఎంతో ట్యాలెంట్ ల‌క్ చెక్ చేసుకోవ‌డానికి వ‌స్తూనే ఉంటుంది. ఎంద‌రో న‌వ‌త‌రం హీరోలు పెద్ద తెర క‌ల‌ల్ని నిజం చేసుకునేందుకు త‌పిస్తూనే ఉంటారు. కొంద‌రికి అలా అదృష్టం క‌లిసొస్తుంది. మ‌రికొంద‌రికి టైమ్ ప‌డుతుంటుంది. ఆ కోవ‌లోనే ల‌క్ తో పాటు ప్ర‌తిభ‌ను న‌మ్ముకుని కెరీర్ ని సాగించాల‌న్న ప‌ట్టుద‌ల‌తో ఉన్నాడు హుషారు ఫేం తేజ్ కూర‌పాటి. ఈ యంగ్ హీరో న‌టించిన తొలి సినిమాతోనే న‌టుడిగా ఆక‌ట్టుకున్నాడు. మ‌లి ప్ర‌య‌త్నం ఎక్క‌డా త‌గ్గ‌డం లేద‌న‌డానికి ఇదిగో ఈ ఫోటోనే సాక్ష్యం.

హుషారు ఫేమ్ తేజ్ కూరపాటి న‌టిస్తున్న తాజా చిత్రం సెట్స్ పై ఉంది. ఈ చిత్రంలో అఖిల ఆకర్షణ, జంటగా కల్పనా రెడ్డి, తనికెళ్ళ భరణి , జీవ, జోగి బ్రదర్స్ ప్రధాన తారాగ‌ణం. జి .వి .ఆర్ ఫిలిం మేకర్స్ సమర్పణలో రాజధాని ఆర్ట్ మూవీస్ నిర్మాణంలో ముల్లేటి కమలాక్షి గుబ్బల వేంకటేశ్వర రావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఆహ్లాదకరమైన గ్రామీణ నేపధ్యంలో తెరకెక్కుతున్న చిత్ర‌మిది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పరిస‌రాల్లో షూటింగ్ జరుపుకుంది. పుట్టినరోజు సందర్భంగా చిత్ర యూనిట్ తేజ్ కూరపాటికి శుభాకాంక్షలు తెలిపారు.

నిర్మాతలు మాట్లాడుతూ -“దర్శకుడు ప్రతి సన్నివేశాన్ని అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు. సినిమా బాగా వచ్చింది, అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే లవ్ స్టోరీ ఇది“ అని తెలిపారు. దర్శకుడు వెంకట్ వందెల మాట్లడుతూ -“హుషారు సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న తేజ్ ఈ సినిమాలో మరో డిఫరెంట్ రోల్ లో మెప్పించ‌నున్నాడు. నిర్మాతలు రాజీకి రాకుండా పూర్తి సహకారం అందిస్తున్నారు. మనకు తెలీకుండా మనలో ప్రేమ పుట్టినప్పుడు మనకు ఆశ్చర్యం వేస్తుంది, ఆ ప్రేమ ఒక వ్యక్తి ద్వారా పుట్టిందని తెలిసినప్పుడు ఆ వ్యక్తి కోసం ఎంత దూరమైన వెళ్లాలనిపిస్తుందనే సస్పెన్స్ క్యూట్ లవ్ స్టొరీ ఇది“ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: సందీప్ కుమార్, కెమెరా: వంశీ ప్రకాష్.