లాక్ డౌన్‌తో నిలిచిపోయిన సినిమా, టీవీ షూటింగ్స్ ఇతర కార్యకలాపాలు త్వరలో పునఃప్రారంభమయ్యే నేపథ్యంలో వాటికి సంబంధించి 16పేజీల మార్గదర్శకాలను జారీ చేసింది కేంద్రం. షూటింగ్ స్పాట్లో ఈ నియమ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేసింది సాంస్కృతిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ. ప్రతి ఒక్కరు మాస్కులు, శానిటైజరు, గ్లౌజులు, భౌతికదూరం వంటి జాగ్రత్తలు పాటించాలని సూచించింది. అందులోని ముఖ్యమైన మార్గదర్శకాలపై ఓ లుక్కేద్దాం.
చేతులు కడుక్కోవడం, శానిటైజేషన్ ప్రతి ఒక్కరికీ తప్పనిసరి. యూనిట్ సభ్యులు ప్రతి ఒక్కరూ మాస్క్, గ్లోవ్స్ షూటింగ్ స్పాట్లో ఉన్నంత సేపూ విధిగా ధరించాలి.
సెట్లోకి ప్రవేశించే ప్రతి ఒక్కరూ థర్మల్ స్క్రీనింగ్ తప్పనిసరిగా చేయించుకోవాలి. అధిక శరీర ఉష్ణోగ్రత ఉన్న వ్యక్తుల్ని సెట్లోకి రానివ్వకూడదు.
ఇండోర్ లొకేషన్స్‌లో గాలి ప్రసరణ సరిగ్గా ఉండేలా చూసుకోవాలి. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా డిస్పోసబుల్ గ్లాసులు, ప్లేట్లు, కప్స్ ఉపయోగించాలి. ముఖ్యంగా ప్రింటర్ స్టేషన్స్‌లోని కరెంట్‌తో సహా ఇతరత్రా మీటాలను కూడా శానిటైజింగ్ చేయాలి.
సెట్లోని ప్రతి ఒక్కరు తమ ఫోన్లలో ‘ఆరోగ్య సేతు’ యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి. తప్పనిసరిగా భౌతిక దూరం పాటించాలి. వైద్య సిబ్బంది, సెట్స్ బయట అన్ని వేళలా ఆంబులెన్స్ అందుబాటలో ఉండటం తప్పనిసరి.
ప్రతిరోజూ షూటింగ్ ప్రారంభించే ముందు స్టూడియో మొత్తాన్ని శానిటైజ్ చేయాలి.
గర్భవతి, 65 ఏళ్లు పైబడిన వారు షూటింగ్ స్పాట్లో లేకుండా చూసుకుంటే మంచిది. ఒకవేళ ఉంటే వారి కోసం ప్రత్యేక సౌకర్యాలు ఏర్పాటు చేయాలి. షూటింగ్ సమయాల్లో అభిమానులను మాత్రం అస్సలు అనుమతించకూడదు.
ఆడిషన్స్ వీలైనంత వరకు ఫేస్ టైమ్, జూమ్, స్కైప్ వంటి సామాజిక మాధ్యమాల యాప్ ద్వారా జరిగేలా చూసుకోవాలి.
నటీనటులను తమ కాస్ట్యూమ్ వారే తెచ్చుకునే విధంగా ప్రోత్సహించాలి.
24 గంటలపాటు షూటింగ్ స్పాట్, స్టూడియోల్లో సెక్యూరిటీ గార్డ్స్ విధుల్లో ఉండేలా చూసుకోవాలి. తద్వారా అతడు మాత్రమే గ్లౌజులు ధరించి తలుపులను తెరవడం, మూసివేయడం చేయడం ద్వారా ఎవరు తలపుల హ్యాండిల్స్‌ను తాకకుండా ఉండే అవకాశం ఉంటుంది.
మధ్యాహ్న భోజన సమయంలోనూ భౌతిక దూరం తప్పనిసరి. ముఖ్యంగా పెళ్లి, మార్కెట్లు, ఫైట్ వంటి భారీ సన్నివేశాలను కరోనా తగ్గేవరకు చిత్రీకరించకుండా ఉండటం మంచిది.
మేకప్ సిబ్బంది, హెయిర్ డ్రెస్సర్స్ పీపీఈ సెట్స్ ధరించాలి. ప్రతి ఒక్కరికీ మేకప్ చేసే ముందు, చేసిన తర్వాత శానిటైజ్ చేసుకోవడం తప్పనిసరి. మేకప్ చేసే సమయంలో మూడో వ్యక్తిని దగ్గరకు రానివ్వకూడదు.
10ఏళ్ల లోపు పిల్లలను సెట్లోకి అనుమతించకూడదు. ఒకవేళ అనుమతిస్తే ఆ పిల్లల బాగోగులు చూసుకోవడానికి ఒక్కరిని మాత్రమే నియమించాలి.
నాన్ ఫిక్షన్ షోల్లో భౌతిక దూరం ఉండేలా సీట్లను కేటాయించాలి.
షూటింగ్లో ఉన్న నటీనటులకు, మిగతా సిబ్బందికి వసతి కల్పించడం, ముఖ్యంగా వారి ప్రయాణాల కోసం ప్రత్యేక వాహనాలను కేటాయించడం వంటివి చేయాలి. వారు ప్రజారవాణాను ఉపయోగించకుండా చూసుకోవాలి.
సెట్స్ లేదా స్టూడియోల్లో ప్రొడక్షన్ బృందాలకు ప్రత్యేక విభాగాలను కేటాయించాలి. తద్వారా పనిచేసే సబ్బంది గుమిగూడకుండా ఉండటానికి దోహదపడతుంంది.
సెట్స్‌లో ఉన్నవారు ఒకరి ఫోన్లను ఒకరు తాకకూడదు. ముఖ్యంగా భోజనాలను ప్రత్యేకంగా ఇంటి వద్ద నుంచే తెచ్చుకునేలా వారిని ప్రోత్సాహించాలి.
సెట్స్‌లో ఉన్నవారు.. వారికి సంబంధించిన కుటుంబ సభ్యులు, సన్నిహితులు లేదా ఇంకెవరికైనా కరోనా లక్షణాలు కనబడితే వారు స్వచ్ఛందంగా క్వారంటైన్లోకి వెళ్లిపోవాలి.
టీవీ కార్యక్రమాలు లేదా సినిమాల షూటింగ్ కోసం ఆ సదరు నిర్మాత అక్కడి స్థానిక కలెక్టర్ దగ్గర నుంచి అనుమతి పత్రం పొందాలి.