`మహానటి` సినిమాతో తెలుగులో బయోపిక్‌ల సీజన్ మొదలైంది. మధ్యలో ఎన్టీఆర్ బయోపిక్ వచ్చినా ఏమంతగా ప్రభావం చూపలేకపోయింది. అయితే వాస్తవిక కోణంలో ఆ చిత్రాన్ని తెరపైకి తీసుకురాలేకపోవడం వల్లే `ఎన్టీఆర్` బయోపిక్‌ని ప్రేక్షకులు తిరస్కరించారు. తాజాగా ఓ స్పోర్ట్స్ పర్సన్ లైఫ్ స్టోరీ తెరపైకి రాబోతోంది. 2000 సంవత్సరంలో జరిగిన ఒలింపిక్స్‌లో భారత్‌కు పతకాన్నిఅందించిన తొలి మహిళా క్రీడాకారిణి కరణం మల్లేశ్వరి.
ఆమె జీవితకథని కోన వెంకట్ సినిమాగా తెరపైకి తీసుకురాబోతున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. ఎం.వి.వి. సత్యనారాయణతో పాటు ఓ బాలీవుడ్ నిర్మాణ సంస్థతో కలిసి కోన వెంకట్ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. తెలుగు, తమిళ. హిందీ భాషల్లో నిర్మాణం జరుపుకోనున్న ఈ చిత్రానికి `రాజుగాడు` ఫేమ్ సంజనారెడ్డి దర్శకత్వం వహించనుందని తెలిసింది. కరణం మల్లేశ్వరి శ్రీకాకులం జిల్లాకు చెందిన వ్యక్తి అన్న విషయం తెలిసిందే. సంజనారెడ్డిది కూడా శ్రీకాకులం జిల్లానే.