‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ పరిస్థితి ఏంటి?

అంజలి సినీ కెరీర్‌లో దక్కిన భారీ విజయాల్లో ‘గీతాంజలి’ ఒకటి. హారర్‌ కామెడీ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా అప్పట్లో సినీప్రియుల్ని బాగా ఆకట్టుకుంది. ఇప్పుడీ చిత్రానికి కొనసాగింపుగా ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ సిద్ధమైంది. ’గీతాంజలి’ సినిమా తీసి తొలి ప్రయత్నంలోనే దర్శకుడిగా సత్తా చాటిన శ్రీను అలియాస్‌ శ్రీనివాస్‌ (శ్రీనివాస్‌ రెడ్డి) ఆ తర్వాత హ్యాట్రిక్‌ ప్లాప్‌లు ఇస్తాడు. ఫలితంగా చేతిలో అవకాశాలు లేక ఆర్థిక సమస్యల్లో చిక్కుకుంటాడు. ఈ క్రమంలోనే పొట్టకూటి కోసం వైజాగ్‌లో ఉంటున్న తన మిత్రుడు అయాన్‌ (సత్య)ను హీరో చేస్తానని చెప్పి మోసం చేస్తూ ఉంటాడు.

ఒకరోజు హైదరాబాద్‌ వచ్చిన అయాన్‌.. తాను మోసపోయానని అర్థమై శ్రీను పరిస్థితి చూసి ఏవిూ చేయలేకపోతాడు. అప్పుడే అయాన్‌, శ్రీనులతో పాటు తన సహ రచయితలు ఆరుద్ర (షకలక శంకర్‌), ఆత్రేయ (సత్యం రాజేష్‌) గ్యాంగ్‌ ఓ ఆలోచన చేస్తారు. ఇండస్ట్రీకి దూరంగా వెళ్లిపోవాలని నిర్ణయం తీసుకుంటారు. సరిగ్గా అప్పుడే ఊటీలో ఉండే విష్ణు రిసార్ట్స్‌ యజమాని విష్ణు (రాహుల్‌ మాధవ్‌) మేనేజర్‌ నుంచి శ్రీనుకు ఓ ఫోన్‌ వస్తుంది. తనతో ఓ హారర్‌ థ్రిల్లర్‌ సినిమా నిర్మిస్తానని చెప్పి.. ఓ కథను శ్రీను గ్యాంగ్‌ చేతిలో పెడతాడు. కాకపోతే ఆ కథను తాను కొన్న సంగీత్‌ మహల్‌లోనే చిత్రీకరించాలని షరతు పెడతాడు. ఆ కథ కోసం నాయికగా అంజలి (అంజలి)ని తీసుకోమని సూచిస్తాడు. వాళ్లంతా విష్ణు మాట ప్రకారమే సినిమాని ఆ మహల్‌లోనే తీసేందుకు సిద్ధమై అక్కడ అడుగు పెడతారు. మరి ఆ మహల్‌లోకి అడుగు పెట్టిన అంజలి, శ్రీను గ్యాంగ్‌కు ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి? విష్ణు తన సినిమాని ఆ మహల్‌లోనే చిత్రీకరించాలని ఎందుకు పట్టుబట్టాడు? తన చిత్రాన్ని అంజలి, శ్రీనుల చేతుల్లోనే ఎందుకు పెట్టాడు? వీళ్ల కోసం గీతాంజలి ఆత్మ మళ్లీ ఎందుకు తిరిగొచ్చింది? అన్నది మిగతా కథ.

’గీతాంజలి’ చిత్ర విజయానికి ప్రధాన కారణం అందులోని భయం.. వినోదంతో పాటు చక్కటి ఎమోషన్సే. అయితే ’గీతాంజలి మళ్ళీ వచ్చింది’ విషయానికొస్తే.. కథలో బలమైన ఎమోషన్స్‌ ఎక్కడా కనిపించవు. పూర్తిగా వినోదాన్ని.. కొంత వరకు హారర్‌ ఎలిమెంట్స్‌ను నమ్ముకొని చేసిన ప్రయత్నంగా కనిపిస్తుంది. ఇది ప్రేక్షకుల్ని అక్కడక్కడా భయపెడుతూనే ఆద్యంతం కడుపుబ్బా నవ్వించింది. నిజానికి ఇలా నవ్విస్తూ ఏ కథ చెప్పినా ప్రేక్షకులు లాజిక్కులు పట్టించుకోకుండా దాన్ని ఆస్వాదించే ప్రయత్నం చేస్తుంటారు.

అదే ఈ చిత్ర విషయంలోనూ మరోసారి నిరూపితమవుతుంది. ఈ సీక్వెల్‌ కథ తొలి భాగంతో ముడిపడి ఉన్నప్పటికీ.. ఆ సినిమా చూడని వాళ్లకు సైతం తేలికగా అర్థమయ్యేలాగే ఉంటుంది. శ్రీను గ్యాంగ్‌కు విష్ణు సినిమా అవకాశం ఇవ్వడం.. దానికోసం వాళ్ల బృందంతో తను ఊటీకి వెళ్లడంతోనే అసలు కథ మొదలవుతుంది. ఇక ఆ తర్వాత వచ్చే సంగీత మహల్‌ ఎపిసోడ్‌ కథను హారర్‌ కోణంలోకి తీసుకెళ్తుంది. ఆ మహల్‌ చరిత్ర… అందులోని నటరాజశాస్త్రి కుటుంబ నేపథ్యం.. వాళ్లు దెయ్యాలుగా మారిన తీరు.. ఆ తర్వాత ఆ మహల్‌లో జరిగే ప్రేమజంటల హత్యలు.. అన్నీ థ్రిల్లింగ్‌గా అనిపిస్తాయి. దీంతో ఆ దెయ్యాల కొంపలో శ్రీను, అంజలి గ్యాంగ్‌ సినిమా చిత్రీకరణ ఎలా జరుపుతారా? అన్న ఆసక్తి ప్రేక్షకుల్లో మొదలవుతుంది. ఈ క్రమంలో వచ్చే విరామ సన్నివేశాలు ద్వితీయార్ధంపై ఆసక్తిరేకెత్తించేలా ఉంటాయి.

నిజమైన దెయ్యాల్ని జూనియర్‌ ఆర్టిస్ట్‌లని శ్రీను అందర్నీ నమ్మించడం.. వాళ్లని మలయాళీ మెథడ్‌ ఆర్టిస్ట్‌లుగా భావించి అంజలి, అయాన్‌, కెమెరామెన్‌ కిల్లర్‌ నాని (సునీల్‌) వారితో వ్యవహరించే తీరు కడుపుబ్బా నవ్విస్తుంది. ముఖ్యంగా తన గదిలో ఉన్న ఆడ దెయ్యానికి ఎన్ని రకాలుగా ఏడవొచ్చన్నది సత్య చేసి చూపించిన తీరు హిలేరియస్‌గా పేలింది. అలాగే కిల్లర్‌ నానిగా దెయ్యం నటరాజ శాస్త్రితో సునీల్‌ చేసే హంగామా కూడా బాగా నవ్వులు పూయిస్తుంది. ª`లకైమాక్స్‌ ముందు వరకు వీరి సినిమా చిత్రీకరణ సందడితోనే కథనమంతా సరదా సరదాగా సాగిపోతుంది.

అంతా తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. ఇక అయాన్‌గా సత్య.. సినిమాటోగ్రాఫర్‌ నానిగా సునీల్‌ కడుపుబ్బా నవ్వించారు.వీరి పాత్రలు సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. ముఖ్యంగా ఇంటర్వెల్‌ తర్వాత సత్య మరింత చెలరేగిపోయాడు. తను తెరపై కనిపించిన ప్రతిసారీ థియేటర్‌ నవ్వులతో ఊగిపోతుంది. దెయ్యాలుగా రవిశంకర్‌, ప్రియ ఓవైపు భయపెడుతూనే.. మరోవైపు నవ్వించారు. ప్రతినాయకుడిగా విష్ణు పాత్రలో కనిపించిన రాహుల్‌ మాధవ్‌ నటన ఆకట్టుకుంటుంది. కోన వెంకట్‌ రాసుకున్న కథలో పెద్దగా మలుపులు, మెరుపులు లేవు. కాకపోతే దాన్ని వినోదభరితంగా తెరపై చూపించిన తీరు.. ట్రెండ్‌కు తగ్గట్లుగా రాసిన సంభాషణలు సినిమాకి కొత్తదనాన్ని అందించాయి. దర్శకుడిగా శివ తన పాత్రకు న్యాయం చేసే ప్రయత్నం చేశారు.