Geethanjali Malli Vachindhi Movie Review: ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ మూవీ రివ్యూ..

హీరోయిన్ అంజలి ప్రధాన పాత్రలో 10 సంవత్సరాల క్రితం వచ్చిన హారర్ కామెడీ సినిమా ‘గీతాంజలి’కి సీక్వెల్ గా ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ సినిమాని తెరకెక్కించారు. ఎం.వి.వి సత్యనారాయణ, కోన వెంకట్ నిర్మాణంలో శివ తుర్లపాటి దర్శకత్వంలో ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ సినిమా తెరకెక్కింది. నేడు ఏప్రిల్ 11న థియేటర్స్ లోకి ఈ సినిమా వచ్చింది.

కథ.. పార్ట్ 1 చివర్లో గీతాంజలి(అంజలి) దయ్యం నుంచే కథ మొదలుపెట్టారు. ఓ ఆఫీస్ లో ఓ వ్యక్తి చనిపోవడంతో అక్కడ దయ్యం ఉందని కొంతమందిని పిలిపించి ఆ గీతాంజలి ఆత్మని ఓ బొమ్మలో బంధించి ఊరి చివర పాతిపెడతారు. కొన్నాళ్ళకు అది బయటకి వచ్చి వెంకట్రావు(అలీ) చేతిలోకి వస్తుంది. పార్ట్ 1లో సినిమా తీసి హిట్ కొట్టిన శ్రీను(శ్రీనివాస్ రెడ్డి) వరుసగా మూడు ఫ్లాప్స్ తీయడంతో సినిమా ఛాన్సులు రాక కష్టాలు పడుతూ ఉంటాడు. తన ఫ్రెండ్ అయాన్(సత్య)ని మోసం చేసి హీరో చేస్తానంటూ డబ్బులు తీసుకుంటాడు. అయాన్ హైదరాబాద్ కి రావడంతో వీళ్ళ మోసం బయటపడుతుంది. అదే సమయంలో శ్రీనుకి ఊటీ నుంచి విష్ణు(రాహుల్ మాధవ్) అనే వ్యక్తి మేనేజర్ కాల్ చేసి సినిమా తీద్దామని రమ్మంటాడు. పార్ట్ 1లో గీతాంజలి చెల్లి అంజలి(అంజలి డ్యూయల్ రోల్) ఇక్కడే ఊటీలో కాఫీ షాప్ నడిపిస్తుంది. విష్ణు శ్రీనుకి సినిమా ఛాన్స్ ఇచ్చి అక్కడ ఉన్న భూత్ బంగ్లా సంగీత్ మహల్ లోనే షూటింగ్ చేయాలని, అంజలినే హీరోయిన్ గా పెట్టాలని కండిషన్స్ పెడతాడు. ఆ సంగీత్ మహల్ లో శాస్త్రి(రవిశంకర్), ఆయన భార్య(ప్రియా), ఆయన కూతురు దయ్యాలుగా ఉంటారు. అసలు సంగీత్ మహల్, అందులోని దయ్యాల కథేంటి? విష్ణు శ్రీనుని పిలిపించి మరీ సినిమా ఛాన్స్ ఎందుకు ఇచ్చాడు? అంజలినే హీరోయిన్ గా పెట్టాలని, బూత్ బంగ్లాలోనే షూట్ చేయాలని ఎందుకు కండిషన్స్ పెట్టాడు? సినిమా తీసారా? గీతాంజలి ఆత్మ ఉన్న బొమ్మ ఏమైంది? గీతాంజలి మళ్ళీ వచ్చిందా అనేది తెలియాలంటే తెరపై చూడాల్సిందే.

విశ్లేషణ.. పార్ట్ 1లో హారర్ కామెడీ రెండు అంశాలని చక్కగా కుదిర్చి హిట్ కొట్టారు. ఇప్పుడు పార్ట్ 2 లో కూడా అయి రెండు అంశాలని పర్ఫెక్ట్ గా రాసుకొని ప్రేక్షకులని మెప్పించారు. సినిమా అంతా కామెడీతో నవ్విస్తూనే మధ్యమధ్యలో భయపెడుతూ ఉంటారు. ఫస్ట్ హాఫ్ లో సినిమా కష్టాలు, సంగీత్ మహల్, అక్కడ దయ్యాలు కథ చెప్పి ఇంటర్వెల్ కి అదిరిపోయే ట్విస్ట్ ఇస్తారు. సెకండ్ హాఫ్ లో దయ్యాలతో షూటింగ్ అంటూ ఫుల్ గా నవ్విస్తారు. క్లైమాక్స్ లో మరో ట్విస్ట్ తో మెప్పించి అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్ కూడా ఉంటుంది. ఈ సినిమా గీతాంజలి సినిమాకి పర్ఫెక్ట్ సీక్వెల్ అని చెప్పొచ్చు. రెండు సినిమాలకు కనెక్షన్ ఉంటుంది.

నటీనటులు.. మన తెలుగు హీరోయిన్ అంజలి రెండు పాత్రల్లోనూ మరోసారి మెప్పించింది. శ్రీనివాస్ రెడ్డి, సత్యం రాజేష్, సత్య, షకలక శంకర్, అలీ, సునీల్, శ్రీకాంత్ అయ్యంగార్, జబర్దస్త్ అవినాష్, పవిత్ర.. వీళ్లంతా తమ కామెడీతో ప్రేక్షకులని నవ్వించారు. రవిశంకర్, ప్రియా దయ్యాల పాత్రల్లో మెప్పిస్తారు. మలయాళ నటుడు రాహుల్ మాధవ్ విలనీ షేడ్లో పర్వాలేదనిపించారు. ఈ సినిమాలో దిల్ రాజు, BVS రవి, సురేష్ కొండేటి గెస్ట్ అప్పీరెన్స్ లు ఇవ్వడం విశేషం.

సాంకేతిక అంశాలు.. సినిమాటోగ్రఫీ విజువల్స్ చాలా రిచ్ గా ఉంటాయి. ఊటీ లొకేషన్స్ ని అందంగా చూపించారు. పాటలు ఓకే అనిపించినా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం పర్ఫెక్ట్ గా సెట్ అయింది. కీంది రైటింగ్ అంతా నవ్విస్తుంది. కథనం ఎక్కడా బోర్ కొట్టకుండా సాగుతుంది. కొత్త డైరెక్టర్ శివ తుర్లపాటి దర్శకత్వం వహించిన మొదటి సినిమాతోనే సక్సెస్ అయ్యాడు. గ్రాఫిక్స్ వర్క్ కూడా బాగుంది. నిర్మాణ పరంగా కూడా ఈ సినిమాకి ఖర్చు బాగానే పెట్టినట్టు తెరపై కనిపిస్తుంది.

రేటింగ్ : 3/5