ఆయన రీల్ లైఫ్‌లో విలన్.. కానీ రియల్ లైఫ్‌లో మాత్రం రియల్ హీరో అనిపించుకున్నారు ప్రకాష్‌రాజ్. వెండితెరపై తనదైన విలక్షణ నటనతో ఆకట్టుకుంటున్న ఆయన గత కొంత కాలంగా బీజేపీ విధానాలపై సోషల్ మీడియా వేదికగా జస్ట్ ఆస్కింగ్ అంటూ ప్రశ్నల వర్షం కురిస్తున్నారు. సమయం సందర్భం చిక్కినప్పుడల్లా ప్రశ్నల వర్షం కురిపిస్తున్న ప్రకాష్‌రాజ్ మరోసారి తన మంచి మనసుని చాటుకున్నారు.
కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తున్న వేళ ఉపాది వ్యవస్థలన్నీ కుప్పకూలిపోతున్నాయి. ఇప్పటికే ఆర్థిక మాంధ్యం కారణంగా లక్షలాది మంది రోడ్డున పడ్డారు. తాజాగా కరోనా వైరస్ కారణంగా రోజు పని చేసుకుంటే కానీ రోజు గడవని వారి జీవితాలు మరీ దుర్భరంగా మారబోతున్నాయి. ఇది గమనించిన ప్రకాష్‌రాజ్ పరిస్థితుల్ని అంచనా వేసి తన వద్ద, తన ఫామ్ హౌజ్‌తో పాటు తన వ్యవసాయ క్షేత్రంలో పనిచేసే సిబ్బందికి మే వరకు జీతాలు ముందే చెల్లించి తన గొప్ప మనసుని చాటుకోవడం ఆసక్తికరంగా మారింది. ఈ సందర్భంగా ప్రకాష్‌రాజ్ ట్విట్టర్ వేదికగా పెట్టిన పోస్ట్ ఆకట్టుకుంటోంది.
జనతా కర్ఫ్యూతో.. నా నగదు నిల్వను ఒకసారి చూసుకున్నాను. నా ఇంట్లో.. నా ఫార్మ్ హౌస్‌లో, నా ఫిల్మ్ ప్రొడక్షన్లో, ఫౌండేషన్‌లో ఉద్యోగం చేసేవారికి నా వ్యక్తిగత సిబ్బందికి మే నెల వరకు జీతాలు ముందుగానే చుల్లించేశాను. నేను నిర్మిస్తున్న మూడు చిత్రాలకు సంబంధించి దినసరి వేతనం తీసుకునే కార్మికుల గురించి ఆలోచించాను. కరోనా మహమ్మారితో పాటిస్తున్న సోషల్ డిస్టెన్సింగ్ మూలంగా షూటింగ్స్ నిలిచిపోయాయి. ఆ దినసరి వేతన కార్మికులకు సగం మొత్తం ఇవ్వాలని నిర్ణయించాను. ఇక్కడితో పూర్తి కాదు. నా శక్తిమేరకు చేస్తాను. మీ అందరికి నేను చేసే విన్నపం ఒక్కటే.. మీ చుట్టూ ఒకసారి చూడండి. మీ సహాయం అవసరమైనవారు ఉంటారు. వారిని ఆదుకోండి. ఒకరి జీవనాన్ని.. జీవితాన్ని మీరు నిలిపే సమయం ఇది. ఒకరికి అండగా నిలవాల్సిన తరుణం ఇదిస అని తన గొప్ప మనసుని మరోసారి చాటుకుని రియల్ లైఫ్ హీరో అనిపించుకున్నారు ప్రకాష్‌రాజ్.