రాజ్‌త‌రుణ్‌ని సేవ్ చేస్తున్న మెగా హీరో!

రాజ్ త‌రుణ్

వరుస ఫ్లాప్‌ల‌తో కెరీర్ ఇక ముగిన‌ట్టేనా అనే స్థాయికి చేరిన హీరో రాజ్ త‌రుణ్‌. కెరీర్ ప్రారంభంలో వ‌రుస విజ‌యాన్ని సొంతం చేసుకున్నా ఆ త‌రువాత నుంచి వ‌రుస ఫ్లాప్‌లు, తండ్రి కార‌ణంగా చెడ్డ పేరు.. ఇలా ఇంటా బ‌య‌టా చికాకుల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న హీరో రాజ్ త‌రుణ్. ప్ర‌స్తుతం అత‌ని ఆశ‌ల‌న్నీ విజ‌య్ కుమార్ కొండ రూపొందించిన `ఒరేయ్ బుజ్జిగా` చిత్రంపైనే వున్నాయి.

ఇది ఆడితేనే రాజ్ త‌రుణ్ మ‌ళ్లీ పైకి లేస్తాడు. నాలుగు సినిమాలొస్తాయి. లేదంటే వ‌రుణ్‌సందేశ్‌లా తెర‌మ‌రుగుకావాల్సిందే. ఇలాంటి ప‌రిస్థితుల్లో వున్న ఇత‌నికి మెగా హీరో అండ ల‌భించింది. అతనే వ‌రుణ్‌తేజ్‌. ప్ర‌స్తుతం కిర‌ణ్ కొర్ర‌పాటి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్న `బాక్స‌ర్` చిత్రంలో న‌టిస్తున్నాడు. ఈ చిత్రం ఇటీవ‌లే వైజాగ్‌లో ప్రారంభ‌మైంది. అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో సిద్దు ముద్ద‌తో క‌లిసి అల్లు వెంక‌టేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈ చిత్రానికి వ‌న్ ఆఫ్ ద ప్రొడ్యూస‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న సిద్దు ముద్ద‌తో రాజ్ త‌రుణ్ హీరోగా ఓ సినిమా సెట్స్‌పైకి వ‌చ్చేలా వ‌రుణ్ తేజ్ ప్లాన్ చేశార‌ట‌.

మోహ‌న్ అనే నూత‌న ద‌ర్శ‌కుడు ఈ చిత్రం ద్వారా ప‌రిచ‌యం కానున్నాడ‌ట‌. వ‌రుణ్ ప్రోత్సాహంతో మోహ‌న్‌, సిద్దు ముద్ద ఇద్ద‌రు క‌లిసి ఇటీవ‌ల రాజ్ త‌రుణ్‌ని క‌లిసి ప్రాజెక్ట్‌ని ఓకే చేయించుకున్నార‌ట‌. త్వ‌ర‌లోనే ఈ చిత్రం ప్రారంభం కానుంద‌ని, దీనికి సంబంధించిన అఫీషియ‌ల్ అనౌన్స్ మెంట్ రానుంద‌ని తెలిసింది.