మ‌హేష్‌, వంశీ పైడిప‌ల్లి సినిమా స్టోరీ లీక్‌?

టాలీవుడ్ స్టార్ హీరోల‌కు లీకుల బెడ‌ద ప‌ట్టుకుంది. ఎంత ప‌క్కాగా ప్లాన్ చేసుకున్నా లీకులు జ‌రుగుతూనే వున్నాయి. ఆర్ ఆర్ ఆర్ నుంచి ప‌వ‌న్ పింక్ రిమేక్ వ‌ర‌కు వ‌రుస లీకులు చిత్ర వ‌ర్గాల‌ని క‌ల‌వ‌రానికి గురిచేస్తున్నాయి. తాజాగా మ‌రో బిగ్ సినిమా స్టోరీ లీక్ అయిపోయి ఫిల్మ్ స‌ర్కిల్స్‌లో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. వంళీ పైడిప‌ల్లితో మ‌హేష్ ఓ సినిమాకు క‌మిట్ అయిన విష‌యం తెలిసిందే. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించ‌బోతున్నారు.

వంశీ పైడిప‌ల్లి, మ‌హేష్‌ల క‌ల‌యిక‌లో వ‌చ్చిన `మ‌హ‌ర్షి` భారీ విజ‌యాన్ని సొంతం చేసుకున్న విష‌యం తెలిసిందే. ఈ సినిమా త‌రువాత `స‌రిలేరు నీకెవ్వ‌రు`లో న‌టించిన మ‌హేష్ ఆ త‌రువాత త‌న‌తో సినిమా చేయ‌డానికి చాలా మంది ద‌ర్శ‌కులు ఎదురుచూస్తున్నా మ‌ళ్లీ వంశీ పైడిప‌ల్లికే గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చేశాడు. త్వ‌ర‌లో సెట్స్‌పైకి రాబోతున్న ఈ చిత్రంలో మ‌హేష్ స్పైగా క‌నిపిస్తాడ‌ని అంత‌టా ప్ర‌చారం జ‌రిగింది. కానీ ఇందులో మ‌హేష్ రాబిన్‌హుడ్ త‌ర‌హా పాత్ర‌లో క‌నిపిస్తార‌ని. ప‌ర్యావ‌ర‌ణాన్ని నాశ‌నం చేస్తున్న ఓ పారిశ్రామిక వేత్త‌తో పోరాడే యువ‌కుడిగా మ‌హేష్ పాత్ర వుంటుంద‌ని, సినిమాలో మ‌హేష్ గ్యాంగ్‌స్ట‌ర్‌గా కనిపించినా ఆయ‌న పాత్ర రాబిన్‌హుడ్ త‌ర‌హాలో స‌మాజ‌హితాన్ని కోరేవిధంగా సాగుతుంద‌ని ఫిల్మ్ స‌ర్కిల్స్‌లో వినిపిస్తోంది.

ఢిల్లీ లాంటి మ‌హాన‌గ‌రంలో ప్రాణ‌వాయువు క‌లుశితం అయిపోయిన విష‌యం తెలిసిందే. అక్క‌డ స్వ‌స్ఛ‌మైన ఆక్సిజ‌న్ కోసం ఆవుట్ లెట్‌ల‌ని కూడా ఏర్పాటు చేసి గంట‌కి ఇంత అని వెల‌క‌ట్టి అమ్మేస్తున్నారు. అలాంటి ప‌రిస్థితి రానున్న రోజుల్లో దేశ వ్యాప్తం అవుతుందని, ఇప్పుడు మేలుకుని ప‌ర్యావ‌ర‌ణ ర‌క్ష‌ణ‌కు ప్ర‌తీ ఒక్క‌రు పూనుకోవాల‌న్న సందేశంతో వంశీ పైడిప‌ల్లి ఈ చిత్రాన్ని తెర‌పైకి తీసుకురాబోతున్నార‌ట‌. రైతు స‌మ‌స్య‌ల నేప‌థ్యంలో `మ‌హ‌ర్షి` చిత్రాన్ని రూపొందించి వంశీ పైడిప‌ల్లి విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకున్న విష‌యం తెలిసిందే.