తెలుగులో మల్టీస్టారర్ చిత్రాలకి ప్రధాన అడ్డంకి ఇద్దరు హీరోలకు సమ ప్రాధాన్యత. కథ డిమాండ్ చేసినా చేయకపోయినా ఇద్దరు హీరోల్లో ఏ ఒక్కరికీ ప్రధాన్యం పెరగకూడదు తగ్గకూడదు. పెరిగితే తగ్గిన హీరో ఫ్యాన్స్ చేసే రచ్చ మామూలుగా వుండదు. దీన్ని తట్టుకోలేకే తెలుగులో మల్టీస్టారర్ చిత్రాలు చేయడానికి దర్శకులు, హీరోలు భయపడుతున్నారు. ఆ భయం `ఆర్ఆర్ఆర్` సినిమాను కూడా వెంటాడింది. వెంటాడుతోంది కూడా.
అయితే ఈ శుక్రవారం రామ్‌చరణ్ బర్త్‌డే సందర్భాన్ని పురస్కరించుకుని రాజమౌళి టీమ్ ఓ సర్ప్రైజ్ వీడియో టీజర్‌ని రిలీజ్ చేసింది. ఈ వీడియోలో రామ్‌చరణ్ మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుగా కనిపించాడు. యుక్త వయసులో ఉడుకు రక్తంతో అల్లూరి ఇలాగే వుండేవాడా? అని కళ్లకు కట్టినట్టు చూపించే ప్రయత్నం చేశాడు రాజమౌళి. అయితే ఇక్కడే తన మ్యాజిక్‌ని వాడినట్టు స్పష్టమవుతోంది. ఈ వీడియో యంగ్ టైగర్ ఎన్టీఆర్ వాయిస్‌తో మొదలైంది…స్టార్టింగ్ ఎండింగ్ వినిపింపిన వాయిస్ ఎన్టీఆర్‌దే. కనిపించేది రామ్‌చరణే అయినా వీడియో మొత్తం వినిపించింది మాత్రం యంగ్ టైగర్ వాయిసే..
ఇక్కడే రాజమౌళి ఎత్తుగడను మెచ్చుకొని తీరాలి. సినిమాలోని ఇద్దరి పాత్రల్లో రామ్‌చరణ్ పాత్రకున్న ప్రియారిటీ ఎక్కువే అని కనిపిస్తున్నా ఆ ఫీలింగ్ ఎక్కడా రానివ్వకుండా ఎన్టీఆర్ చేత రామ్‌చరణ్ పాత్రని పరిచయం చేయించడం నిజంగా రాజమౌళి బ్రిలియన్సీకి భళా అనక వుండలేం. ఎక్కడ ఎవరిని తగ్గించాలో కాదు.. ఎక్కడ ఎవరినీ తగ్గించకుండా చూడాలో రాజమౌళికి తెలిసినంతగా మరెవరికి తెలియదని నిరూపించి భళా అనిపించాడు. రాజమౌళి డబుల్ ట్రీట్‌తో ఫ్యాన్స్ కూడా సంబరాల్లో మునిగితేలుతున్నారు.