బ్లాక్ బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్‌ని రిజెక్ట్ చేశారా?

బ్లాక్ బ‌స్ట‌ర్ ఇచ్చాడంటే ఆ ద‌ర్శ‌కుడి వెంట నిర్మాత‌లు, హీరోలు వెంట‌ప‌డుతుంటారు. కానీ యంగ్ డైరెక్ట‌ర్ ని మాత్రం ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేద‌ట‌. ఈ సంక్రాంతికి రెండు భారీ చిత్రాలు పోటీప‌డ్డాయి. మ‌హేష్ న‌టించిన `స‌రిలేరు నీకెవ్వ‌రు`, అల్లు అర్జున్ న‌టించిన `అల వైకుంఠ‌పుర‌ములో`. ఈ రెండు చిత్రాల్లో ఇండ‌స్ట్రీ హిట్‌గా నిలిచింది మాత్రం అల్లు అర్జున్ న‌టించిన `అల వైకుంఠ‌పుర‌ములో`. అల్లు అర‌వింద్ ప్లానింగ్, బ‌న్నీ వాస్ టీమ్‌ ఈ చిత్రాన్ని ఇండ‌స్ట్రీ హిట్‌గా నిల‌బెట్టాయి.

అదే ప్లాన్‌ని `స‌రిలేరు నీకెవ్వ‌రు` టీమ్ అనుస‌రించ‌లేక‌పోయింది. దాంతో ఈ మూవీ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కే ప‌రిమిత‌మైపోయింది. ఈ సినిమాతో సంక్రాంతికి హిట్‌ని సొంతం చేసుకున్న ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడికి మాత్రం ఆస్థాయిలో ఆఫ‌ర్లు క‌నిపించ‌డం లేదు. ఈ సినిమా రిలీజ్ త‌రువాత తాజాగా అనిల్ కొంత మంది హీరోల‌ని క‌లిసి క‌థ‌లు వినిపించాడ‌ట‌. విన్న ప్ర‌తీ హీరో అనిల్ చెప్పిన క‌థ‌ల్ని రిజెక్ట్ చేసిన‌ట్టు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల టాక్‌. ఇదిలా వుంటే ఆగ‌స్టుతో `ఎఫ్‌2`కు సీక్వెల్‌గా `ఎఫ్‌3`ని అనిల్ స్టార్ట్ చేయ‌బోతున్నాడ‌ని వార్త‌లు మాత్రం వినిపిస్తున్నాయి.