కరోనా వైరస్ ప్రపంచాన్ని క్షణ క్షణం భయానికి గురిచేస్తోంది. ఎప్పుడు ఎలా పరిణమిస్తుందో తెలియని అయోమయానికి గురిచేస్తోంది. ఎంత నివారణ చర్యలు చేపట్టినా ఏదో మూల ఎవరో ఒకరి దీని బారిన పడుతూనే వున్నారు. అంతకంతకు కరోనా కేసులు ప్రపంచ వ్యాప్తంగా పెరిగిపోతున్నాయి. దీన్ని అరికట్టాలంటే నివారణ చర్యలే శరణ్యమని భావించిన కేంద్ర రాష్ట్రాలకు నిశితమైన ఆదేశాలని జారీ చేసింది. భారీ సమూహాలున్న వాటిని వెంటనే మూసి వేయాలని, కొన్ని రోజులు బంద్ చేయాలని చెప్పడంతో రాష్ట్ర ప్రభుత్వాలు శనివారం అత్యవసర సమావేశాన్ని నిర్వహించాయి.
తెలంగాణలో కరోనా వైరస్ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం నివారణ చర్యల్ని కట్టుదిట్టంగా అమలు చేస్తోంది. ఇందులో భాగంగా శనివారం అత్యవసరంగా సమావేశమైన ఉన్నత స్థాయి కమిటీ సంచలన నిర్ణయాలు తీసుకుంది. రానున్న 15 రోజుల పాటు తెలంగాణలోని థియేటర్లు, షాపింగ్ మాల్స్, స్కూల్స్‌ని బంద్ చేయాలని సంచలన నిర్ణయాన్ని ప్రకటించడం విశేషం. ఇప్పటికే పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో పరీక్షల్ని అలాగే కొనసాగించాలని, స్కూల్స్‌ని మాత్రం బంద్ చేయాలని నిర్ణయం తీసుకుంది.