బాలయ్యపై నాగబాబు ఫైర్.. ఇది పక్కా పొలిటికల్ టర్న్
ఇండస్ట్రీలో పెద్ద కుటుంబాల మధ్య అప్పుడప్పుడు విభేదాలు రాజుకోవడం సర్వ సాధారణం. ఎప్పుడైనా పెద్ద హీరోలు బయటికొచ్చినప్పుడు వీటిపై స్పందించి తాము కలిసే ఉన్నామని చెప్పడం, అవి సద్దుమణగడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా రాజుకున్న నందమూరి వెర్సెస్ మెగా నిప్పు మాత్రం పరిశ్రమ నుండి పొలిటికల్ టర్న్ తీసుకుంది. మొన్నామధ్యన షూటింగుల విషయమై ఇండస్ట్రీ తరపున చిరు, నాగార్జున, సి. కల్యాణ్, త్రివిక్రమ్ లాంటి కొందరు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నేతృత్వంలో సీఎం కేసీఆర్ వద్దకు వెళ్లి చర్చలు జరిపారు. ఈ చర్చలకు నందమూరి బాలకృష్ణను ఆహ్వానించలేదు.
తాజాగా బాలయ్య ఒక జర్నలిస్టుతో మాట్లాడుతూ నన్నెవరూ పిలవలేదు. వీళ్ళంతా కూర్చుని భూములు పంచుకుంటారా అంటూ ఫైర్ అయ్యారు. ఈ మాటలు టీవీ ఛానెళ్లలో హైలెట్ అయ్యాయి. వీటి పట్ల తలసాని, సి. కల్యాణ్ చాలా నిమ్మళంగా రియాక్ట్ అవ్వగా మెగా బ్రదర్ నాగబాబు మాత్రం పెద్ద పెద్ద విమర్శలే గుప్పించారు. నాగబాబు చేసిన రెండు మూడు వ్యాఖ్యలు ఇష్యూని పక్కా పొలిటికల్ టర్న్ తీసుకునేలా చేశాయి.
వీడియో ఆరంభంలోనే ఈ వీడియోకు భాద్యత నాదే అంటూ స్టార్ట్ చేసిన నాగబాబు బాలకృష్ణను సమావేశానికి పిలవకపోవడం రైటో రాంగో నాకు తెలీదు. పిలవలేదనే బాధ ఆయనకు ఉండొచ్చు. చాలామందిని పిలవలేదు. కమ్యూనికేషన్ గ్యాప్ అయ్యుండొచ్చు. ఆయన కోప్పడటంలో అర్థం ఉంది. కానీ భూములు పంచుకుంటున్నారని ఆయన మాట్లాడటం భాదాకరం. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలి. అక్కడ భూములు పంచుకోవడానికి ఎవరూ వెళ్లలేదు. వెంటనే ఈ మాటల్ని వెనక్కి తీసుకోవాలి. ఇది పరిశమనే కాదు తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా అవమానించినట్టు. ఇండస్ట్రీకి మీరేమీ కింగ్ కాదు. ఆంధ్రాలో రియల్ ఎస్టేట్ ఎవరు చేశారో, ప్రజల జీవితాలు ఎలా నాశనమయ్యాయో తెలుసు అంటూ మాట్లాడారు.
బాలయ్య టీడీపీకి, నాగబాబు జనసేనకు చెందిన నేతలు కావడం, ఇరు పార్టీలు ఏపీలో ఎడ మొహం, పెడ మొహం అన్నట్టు ఉండటంతో ఈ వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాముఖ్యత సంతరించుకున్నాయి. ఇటు టీడీపీ వాళ్ళు బాలయ్యను వెనకేసుకొస్తే అటు జనసేన కార్యకర్తలు నాగబాబుకు మద్దతుగా మాట్లాడుతున్నారు. మొట్టానికి పరిశ్రమ ఇష్యూ కాస్త బాలయ్య, నాగబాబు వ్యాఖ్యలతో పొలిటికల్ టర్న్ తీసుకుని కొత్త వివాదాలకు దారితీసేలా ఉన్నాయి.