హీరో విజయ్ కొత్త చిత్రం ఫస్ట్ లుక్ వివాదం,నోటీసులు
ఈ మధ్యకాలంలో వివాదం లేనిదే సినిమా ఉండటం లేదు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికి ఎవరో ఒకరికి దొరికిపోతున్నారు. ఇది కేవలం తెలుగుకే కాదు అన్ని భాషల సినిమావాళ్లు ఎదుర్కొంటున్న సమస్య. తాజాగా తమిళ స్టార్ హీరో సైతం ఓ వివాదంలో ఇర్కుకున్నాడు. అయితే విజయ్ సినిమాలకు వివాదం కొత్త కాదు కాబట్టి కూల్ గా పరిష్కరించుకునే ప్రయత్నం చేస్తున్నారు.
వివరాల్లోకి వెళితే..తమిళ హీరో విజయ్, దర్శకుడు అట్లీది హిట్ కాంబినేషన్. ‘తెరి’, ‘మెర్సల్’ తర్వాత వీరిద్దరి కలయిలో వస్తున్న మూడో సినిమా ‘బిగిల్’ (అంటే… విజిల్, ఈల అని అర్ధం). రీసెంట్ గా విజయ్ పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ విడుదల చేశారు.
ఈ ఫస్ట్ లుక్ పై వివాదం మొదలైంది. విజయ్‌పై మత్స్య వ్యాపారులు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. కోవైకు చెందిన అన్నాడీఎంకే నాయకుడు, ఉక్కడం నూతన మార్కెట్లో చెపల దుకాణదారుడు కోళికడై గోపాలం అలియాస్ పళనిస్వామి సహా ఐదుగురు సోమవారం కోవై కలెక్టర్ కార్యాలయంలో నటుడు విజయ్‌పై ఫిర్యాదు చేశారు.
అందులో తమిళనాడులోనే కాకుండా భారతదేశంలోని చేపల దుకాణదారులు, మాంసం వ్యాపారుల మనోభావాలను దెబ్బతీసేలా ప్రవర్తించిన నటుడు విజయ్‌కు తమిళ ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత లేదన్నారు. మత్య్స, మాంస వ్యాపారులు తమ వృత్తిని ప్రారంభించే ముందు వారు ఉపయోగించే కత్తులకు నమస్కరిస్తారన్నారు. అలాంటి కత్తులపై నటుడు విజయ్ కాలు పెట్టి కూర్చున్న దృశ్యంతో కూడిన బిగిల్ ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేశారన్నారు.
ఇది మత్స్య, మాంసాల వ్యాపారుల మనోభావాలకు భంగం కలిగించే ఉందని పేర్కొన్నారు. ఆ సన్నివేశాలను చిత్రం నుంచి తొలగించకుంటే దేశ వ్యాప్తంగా మత్స్య, మాంసం వ్యాపారుల ఆగ్రహాన్ని చవిచూడాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ వ్యవహారంపై ఇప్పటికే నటుడు విజయ్‌కు, ఆ చిత్ర దర్శకుడు అట్లీకీ, చిత్ర నిర్మాణ సంస్థ ఏజీఎన్‌కు లాయర్ ద్వారా నోటీసులు పంపినట్లు తెలిపారు.
ఇందులో ద్విపాత్రాభియనం చేస్తున్నారాయన. మైఖేల్, బిగిల్‌గా కనిపించనున్నారు. తెలుగులో ‘అదిరింది’గా విడుదలైన ‘మెర్సల్’ త్రిపాత్రాభినయం చేయగా… ‘పోలీస్’గా విడుదలైన ‘తెరి’లో మూడు షేడ్స్ ఉన్న పాత్ర పోషించారు. నయనతార హీరోయిన్ గా నటిస్తున్న ‘బిగిల్’కి ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకుడు.