కామెడీ.. రొమాంటిక్ లవ్ స్టోరీల సీజన్ ఇది. పరిమిత బడ్జెట్ కి అనుకూలమైన జోనర్ కూడా ఇదే. అందుకే ఈ తరహా సినిమాల్ని తెరకెక్కించేందుకు యూత్ ఎక్కువ ఇష్టపడుతోంది. కంటెంట్ ఉంటే స్టార్ ఇమేజ్ తో పని లేకుండా హిట్టు కొట్టే ఛాన్సుంది కాబట్టి ఈ పంథానే అలవరుచుకుంటున్నారు. ఇదే తరహాలో రూపొందుతున్న తాజా చిత్రం `ప్రెజర్ కుక్కర్`. ఇందులో సాయి రొనాక్, ప్రీతి అస్రాని జంటగా నటించారు. సుజోయ్, సుశీల్ దర్శక ద్వయం తెరకెక్కిస్తున్నారు. కరంపురి క్రియేషన్స్, మైక్ మూవీస్ పతాకాలపై సుజోయ్, సుశీల్, అప్పిరెడ్డి నిర్మిస్తున్నారు.
ఇప్పటికే ప్రెజర్ కుక్కర్ పోస్టర్లు, టీజర్ కి స్పందన బావుంది. తాజాగా ట్రైలర్ రిలీజైంది. కాస్త సుదీర్ఘ నిడివి ఉన్న ఈ ట్రైలర్ లో నాయకానాయికల మధ్య ఘాటైన రొమాన్స్, సున్నితమైన ప్రేమకథ ఆకట్టుకుంటోంది. ఇక కొత్త వాళ్లే అయినా తొలి పొద్దు ప్రేమకథలోని మాధుర్యం ఆహ్లాదాన్ని పంచుతోంది. రాహుల్ రామకష్ణ సహా ఫ్రెండ్స్ గ్యాంగ్ మధ్య సంభాషణలు.. తనికెళ్ల భరణి పాత్ర చిత్రణ ఆకట్టుకుంటున్నాయి. ఇక ఈ సినిమా ఆద్యంతం అమెరికా డ్రీమ్స్ లో మునిగి తేలే యువతను టార్గెట్ చేసినట్టే అర్థమవుతోంది.
ఈ తరహా కథాంశంతో సినిమా తీయడం ఇప్పుడే కొత్తేమీ కాదు కానీ ఇందులో విదేశీ పిచ్చి గురించి ఆ మాయలో పడి మోసపోయే నిరుద్యోగ యువత గురించి టచ్ చేస్తున్నారని అర్థమవుతోంది. అయితే మరీ సుదీర్ఘమైన సంభాషణలు, మరీ లెంగ్తీగా ఉన్న ట్రైలర్ చూస్తుంటే ఉత్సాహం రెట్టింపు అవ్వడం కష్టమే. ట్రైలర్ అంటే గ్రిప్ ఏమాత్రం సడలని సస్పెన్స్ మెయింటెయిన్ చేస్తూ థియేటర్లకు వెళ్లి చూడాలి అన్నంత గ్రిప్పింగా కట్ చేయాల్సి ఉంటుంది. కానీ ఈ ట్రైలర్ చూస్తే అలా కనిపించడం లేదు. పూర్తి నిడివి సినిమాలో ఇలాంటి సాగతీత ఉంటే కష్టమే. షార్ప్ గా ఎమోషన్ ని సండించే సన్నివేశాలు.. కామెడీ.. కొత్త జంట మధ్య ఘాటైన రొమాన్స్ సరిగ్గా కుదిరితేనే జనాల్ని థియేటర్లకు రప్పించడం సాధ్యపడుతుంది. ఇక అమెరికా డ్రీమ్స్ ని కూడా పాత వాసనలు లేకుండా కొత్తగా ఏం చూపించారన్నది ఇంపార్టెంట్. అమెరికా డ్రీమ్స్ నిజంగానే ప్రెజర్ కుక్కర్ ఒత్తిడి లాంటివే. మరి వాటిని తట్టుకుని వెళితే స్వర్గమే. మరి ఇందులో అంతిమంగా ఏం చూపించబోతున్నారు? అన్నది చూడాలి.