కేజీఎఫ్ స్టార్ య‌ష్ ఆ ‌ప‌ని కూడా చేశాడా?

స‌క్సెస్ బాట‌లో ఎన్నో ముళ్ల‌దారులు వుంటాయ‌న్న‌ది జ‌గ‌మెరిగిన స‌త్యం. అనుకున్న గ‌మ్యాన్ని ముద్దాడాలంటే ఆటు పోట్లు త‌ప్ప‌వు. ఆ గ‌మ్యాన్ని చేరుకోవాలంటే ఎలాంటి క‌ష్టాన్నైనా భ‌రించక తప్ప‌దు. త‌న ప్ర‌స్థానం కూడా అలాంటి ముళ్ల దారిని దాటే ఇప్పుడు ఈ స్థాయికి చేరింద‌ని చెబుతున్నాడు రాఖీభాయ్ య‌ష్‌. `కేజీఎఫ్ చాప్ట‌ర్ 1` చిత్రంతో రాత్రికి రాత్రే పాన్ ఇండియా స్టార్‌గా మారిన య‌ష్ జ‌ర్నీ వెనుక పెద్ద క‌థే వుంద‌ట‌.

`కేజీఎఫ్ చాప్ట‌ర్ 1` సంచ‌ల‌న విజ‌యం సాధించ‌డంతో ప్ర‌స్తుతం ఈ చిత్రానికి సీక్వెల్ `కేజీఎఫ్ చాప్ట‌ర్ 2`ని తెర‌కెక్కిస్తున్నారు. చిత్రీ‌క‌ర‌ణ దాదాపుగా స‌గం వ‌ర‌కు పూర్త‌యింది. అక్టోబ‌ర్ 23న రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా వుంటే తాజాగా ఇటీవల ఓ మీడియాకిచ్చిన ఇంట‌ర్వ్యూలో ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల్ని య‌ష్ వెల్ల‌డించారు. న‌టుడు కావాల‌నే ఇంటి నుంచి బెంగ‌ళూరు పారియాడ‌ట‌. ఆ స‌మ‌యంలో య‌ష్ ద‌గ్గ‌ర‌న కేవ‌లం 300 మాత్ర‌మే వున్నాయ‌ని చెప్పాడు. చేతిలో డ‌బ్బులు, ప‌ని లేక‌పోయినా ఏనాడూ త‌న ఆత్మ విశ్వాసాన్ని వీడ‌లేద‌ని, తిరిగి ఇంటికి వెళ్లినా అమ్మా నాన్న రానివ్వ‌ర‌ని తెలిసి బెంగ‌ళూరులోనే వుండిపోయాన‌ని చెప్పుకొచ్చాడు.

థియేట‌ర్‌లో న‌టించ‌డం మొద‌లుపెట్టాక త‌న న‌ట‌న చూసి ప‌నిచ్చార‌ని, అలా థియేట‌ర్‌లో నాట‌కాలు వేస్తూనే ఎన్నో ప్ర‌దేశాలు తిరిగాన‌ని, పార్ట్ టైమ్ జాబ్‌లు చేస్తూ న‌టుడిగా అదృష్టాన్ని ప‌రీక్షించుకున్నాన‌ని, ఒక ద‌శ‌లో టీలు కూడా అందించాన‌ని వెల్ల‌డించాడు. త‌ను ఈ స్థాయికి రావ‌డానికి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాన‌ని వెల్ల‌డించ‌డంతో య‌ష్ ఫ్యాన్స్ అవాక్క‌వుతున్నారు.